‘గోల్డెన్‌’ గ్రాఫ్‌...

16 May, 2020 02:47 IST|Sakshi

1988లో స్టెఫీ గ్రాఫ్‌ చేసిన అద్భుతం

ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌తోపాటు ఒలింపిక్‌ స్వర్ణం సొంతం

ఈ ఘనత సాధించిన ఏకైక టెన్నిస్‌ తార   

టెన్నిస్‌ ప్రపంచంలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ విజయం సాధించడమే పెద్ద ఘనత. ఒక్క ట్రోఫీతోనే జీవితకాలం సంతృప్తి పొందేవారు ఎందరో. అలాంటిది ఒకే క్యాలెండర్‌ సంవత్సరంలో నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకోవడం అంటే దిగ్గజాలకు మాత్రమే సాధ్యం. చరిత్రలో కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఫీట్‌ను చేసి చూపించగా... వారిలో జర్మనీ స్టార్‌ స్టెఫీ గ్రాఫ్‌ ప్రదర్శన మరింత ప్రత్యేకం. 1988లో స్టెఫీ గ్రాఫ్‌ నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తోపాటు అదే ఏడాది ప్రతిష్టాత్మక సియోల్‌ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధించింది. తద్వారా ఇలాంటి అరుదైన రికార్డు సృష్టించిన ఏకైక ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది.

స్టెఫీ గ్రాఫ్‌ సృష్టించిన ‘క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌’ రికార్డుకు మరో ప్రత్యేకత ఉంది. స్టెఫీకి ముందు ఈ ఫీట్‌ చేసిన మిగతా నలుగురు 1978కి ముందు చేసినవారే. 1978 నుంచే మూడు సర్ఫేస్‌లలో గ్రాండ్‌స్లామ్‌ జరుగుతోంది. అప్పటివరకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పచ్చికపై, యూఎస్‌ ఓపెన్‌ మట్టి కోర్టులపై జరిగేవి. తర్వాత ఈ రెండు వేదికలు కూడా హార్డ్‌ కోర్టులుగా (స్వల్ప తేడా ఉంటుంది) మారాయి. అలా అన్ని తరహా కోర్టుల్లో గ్రాండ్‌స్లామ్‌ సాధించిన ఘనత స్టెఫీకే చెల్లింది. తర్వాతి రోజుల్లో ఇలా గెలవడం అసాధ్యంగా మారిపోవడంతో ఒకే ఏడాది కాకపోయినా... ఏదో ఒక సమయంలో గ్రాండ్‌స్లామ్‌ గెలవడమే గొప్పగా మారింది. దానినే టెన్నిస్‌ ప్రపంచం ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ అంటూ వ్యవహరించడం మొదలుపెట్టింది.

కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌తో ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టెఫీ గ్రాఫ్‌ తన తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను 1987లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ రూపంలో సాధించింది. 1983లో తొలిసారి ‘మేజర్‌’ బరిలోకి దిగినా తొలి నాలుగేళ్లలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్‌ మాత్రమే. 1987 ఆగస్టు 17న తొలిసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్టెఫీ నంబర్‌వన్‌గా నిలిచింది. ఆపై ఆమె సాధించిన రికార్డులు, ఘనతలకు లెక్కే లేదు.

నాలుగుకు నాలుగు... 
ర్యాంకుల్లో అగ్రస్థానంతో ఏడాదిని మొదలుపెట్టిన స్టెఫీ ‘గ్రాఫ్‌’ అమిత వేగంతో ఎదురు లేకుండా  దూసుకుపోయింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో 6–1, 7–6 (7/3)తో నాటి అమెరికా దిగ్గజం క్రిస్‌ ఎవర్ట్‌ను ఓడించి టైటిల్‌ అందుకుంది. టోర్నీలో ఆమె ఒక్క సెట్‌ కూడా ఓడిపోలేదు. ఆపై డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో కేవలం 34 నిమిషాల్లో 6–0, 6–0తో నటాషా జ్వెరేవా (సోవియట్‌ యూనియన్‌)ను చిత్తుచిత్తుగా ఓడించింది. 1911 తర్వాత  ‘డబుల్‌ బేగల్‌’తో ఒక గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ జరగడం ఇదే మొదటిసారి.

టెన్నిస్‌ పరిభాషలో ప్రత్యర్థికి ఒక్క గేమ్‌ కూడా ఇవ్వకుండా సెట్‌ గెలిస్తే బేగల్‌ అంటారు. వింబుల్డన్‌లో స్టెఫీకి మరో విజయం దక్కింది. ఫైనల్లో స్టెఫీ 5–7, 6–2, 6–1తో వరుసగా ఆరుసార్లు (1982–87) టైటిల్‌ సాధించి జోరు మీదున్న మార్టినా నవ్రతిలోవా (అమెరికా)ను బోల్తా కొట్టించడంతో ఈ జర్మనీ అమ్మాయి పేరు మారుమోగిపోయింది. ఇక సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో స్టెఫీ 6–3, 3–6, 6–1తో గాబ్రియెలా సబాటిని (అర్జెంటీనా)పై నెగ్గడంతో ఆమె ‘క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనత పూర్తయింది.

ఒలింపిక్‌ వేటలో... 
యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ ముగిసిన తర్వాత వారం రోజుల్లోనే దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఒలింపిక్స్‌ జరిగాయి. ఇన్ని ఘనతలు సాధించిన తర్వాత ఇంత తక్కువ వ్యవధి ఉంటే ఈతరం ఆటగాళ్లు విశ్రాంతి పేరుతో ఒలింపిక్స్‌కే చివరి నిమిషంలో డుమ్మా కొట్టేవారేమో. కానీ స్టెఫీ అలా చేయలేదు. న్యూయార్క్‌ నుంచి హడావుడిగా స్వదేశం వెళ్లి ఒకే ఒక రోజు విరామం తర్వాత తమ పశ్చిమ జర్మనీ దేశపు ఇతర అథ్లెట్లతో కలిసి ఒలింపిక్స్‌ వెళ్లే విమానం ఎక్కింది. దేశం కోసం సాధించే పతకానికి తన దృష్టిలో చాలా విలువ ఉందని ఆమె చూపించింది. గ్రాండ్‌స్లామ్‌ ఫామ్‌ను ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తూ దూసుకుపోయింది. ఒక్క క్వార్టర్‌ ఫైనల్లో మాత్రం ఆమెకు కాస్త పోటీ ఎదురైంది.

సోవియట్‌ యూనియన్‌కు చెందిన లారిసా సావ్‌చెంకోకు ఒక సెట్‌ చేజార్చుకొని చివరకు మ్యాచ్‌ గెలుచుకుంది. ఫైనల్లో ఆమెకు మరోసారి అర్జెంటీనా అందగత్తె సబాటిని ఎదురైంది. కొద్ది రోజుల క్రితమే హోరాహోరీగా సాగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఆమెను ఓడించిన గ్రాఫ్‌కు ఈసారి ఎదురులేకుండా పోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో స్టెఫీ 6–3, 6–3తో సబాటినిపై గెలుపొంది శిఖరాన నిలిచింది. స్టెఫీ గ్రాఫ్‌ సాధించిన అద్భుతాన్ని పొగుడుతూ ప్రపంచ మీడియా తొలిసారి ‘గోల్డెన్‌ స్లామ్‌’ అనే పదాన్ని ఉపయోగించింది. అది ఆమె కోసమే పుట్టిందన్నట్లుగా మరో ప్లేయర్‌ కోసం దానిని వాడాల్సిన అవసరం లేకపోయింది. పురుషులు, మహిళల విభాగాల్లోనూ ఇప్పటికీ మరెవరూ అందుకోలేని ఘనతగా ‘గోల్డెన్‌స్లామ్‌’ నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు