డోలాయమానంలో టోక్యో ఒలింపిక్స్‌!

11 Apr, 2020 00:26 IST|Sakshi

వచ్చే ఏడాదీ నిర్వహణపై కచ్చితమైన హామీ ఇవ్వలేమన్న నిర్వాహక కమిటీ

టోక్యో: అసలే విశ్వక్రీడలు అనుకున్న సమయంలో జరగకపోవడంతో నిరుత్సాహానికి గురైన క్రీడా లోకంపై టోక్యో ఒలింపిక్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) తోషిరో ముటో మరో బాంబు పేల్చే వ్యాఖ్యనొకటి వదిలారు. వచ్చే ఏడాది జూలై 23కి వాయిదా పడిన ఒలింపిక్స్‌ అప్పుడైనా సరైన సమయంలో జరుగుతాయనే హామీ ఇవ్వలేమని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో 2021 ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ మెగా ఈవెంట్‌ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

‘వచ్చే ఏడాది జూలై నాటికి కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి అదుపులోకి వస్తుందని నమ్మకంగా ఎవరూ చెప్పలేరు. ఈ పరిస్థితుల్లో క్రీడల నిర్వహణ అనుకున్న సమయానికే జరుగుతుందనే కచ్చితమైన హామీ ఇవ్వలేం. ప్రస్తుతం క్రీడలకు ప్రత్యామ్నాయాలు వెతకడం కన్నా మనముందున్న సవాలుపై సమష్టిగా పోరాటం చేయాలి. మానవజాతి అంతా ఏకమై తమ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ కరోనా మహమ్మారికి చికిత్స, వ్యాక్సిన్, మందులు కనిపెట్టేందుకు శ్రమించాలి’ అని ముటో పేర్కొన్నాడు.  

మరిన్ని వార్తలు