కోహ్లిని కౌంటీల్లో అనుమతించవద్దు!

28 Mar, 2018 01:17 IST|Sakshi

 అతను ఇంగ్లండ్‌లో మళ్లీ విఫలం కావాలి

ఇంగ్లండ్‌ దిగ్గజం బాబ్‌ విల్లీస్‌ వ్యాఖ్య

లండన్‌: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు అక్కడి కౌంటీల్లో ఆడి సన్నద్ధం కావాలని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే కోహ్లిని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కౌంటీల్లో అనుమతించడాన్ని ఆ దేశ మాజీ పేసర్‌ బాబ్‌ విల్లీస్‌ తీవ్రంగా విమర్శించాడు. కోహ్లిని ఆడించడం అంటే ఇంగ్లండ్‌ సొంతగడ్డపై కూడా మరో ఓటమికి సిద్ధమైనట్లేనని అతను అన్నాడు. ‘గత టెస్టు సిరీస్‌లాగే ఈసారి కూడా కోహ్లి ఇక్కడ బాగా ఇబ్బంది పడాలని కోరుకుంటున్నా.

విదేశీ ఆటగాళ్లందరికీ మన కౌంటీల్లో ఆడేందుకు అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత దాని వల్ల ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌లు ఓడిపోవడం మేం కోరుకోవడం లేదు. వారి కారణంగా సొంతగడ్డపై ఉండే అదనపు ప్రయోజనాన్ని మా జట్టు కోల్పోతుంది. మనతో సిరీస్‌కు ముందు భారీ మొత్తం తీసుకుంటూ తన ఆటకు పదును పెట్టుకునే అవకాశం కోహ్లికి ఇవ్వడం తెలివి తక్కువ పని’ అని విల్లీస్‌ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌కు చెందిన యువ ఆటగాళ్లకు కౌంటీల్లో పెద్ద సంఖ్యలో అవకాశాలు ఇస్తేనే తమ టెస్టు జట్టు బాగుపడుతుందని అతను అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ తరఫున విల్లీస్‌ 90 టెస్టులు ఆడి 325 వికెట్లు పడగొట్టాడు. 

>
మరిన్ని వార్తలు