యువీకి సరికొత్త తలనొప్పి

4 Jun, 2020 11:07 IST|Sakshi

కులాన్ని కించపరిచావంటూ నెటిజన్లు ఫైర్‌

యువరాజ్‌ సింగ్‌ మాఫీ మాంగో ట్రెండింగ్‌

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు సరికొత్త తలనొప్పి ఎదురైంది. టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ను సరదాగా కామెంట్‌ చేసే క్రమంలో కులం పేరు వాడటం కాస్తా అది వివాదానికి దారి తీసింది. కొన్ని రోజుల క్రితం రోహిత్‌ శర్మతో యువీ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు వైరల్‌గా మారింది. టిక్‌టాక్‌లో చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని, వీళ్లకేం పనిలేదంటూ వాల్మీకి సమాజాన్ని కించపరిచేలా యువీ వ్యాఖ్య చేశాడు.  దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక కులాన్ని ఉద్దేశిస్తూ కామెంట్‌ చేస్తావా అంటూ యువీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక కులం పేరుతో యువరాజ్‌ కామెంట్‌ చేయడం నిజంగా సిగ్గు చేటని సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. (సస్పెన్షన్‌ తొలగించినా కోచ్‌గా నియమించలేదు)

ఏ పరిస్థితుల్లోనైనా మతాన్ని, కులాన్ని, జాతిని, వర్ణాన్ని ఉద్దేశించి మాట్లాడటం అవతలి వాళ్లను కించపరచడమేనంటూ విమర్శలు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే యువరాజ్‌ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ‘యువరాజ్‌ సింగ్‌ మాఫీ మాంగో’(యువరాజ్‌ క్షమాపణలు చెప్పాలి) పేరుతో ట్వీటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. ఇలా యువరాజ్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో విమర్శలకు గురికావడం తొలిసారేమీ కాదు. గతంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ఫౌండేషన్‌కు మద్దతు ప్రకటించిన క్రమంలో కూడా యువీ విమర్శలను చవిచూశాడు. ఒక పాకిస్తాన్‌ క్రికెటర్‌కు ఎలా సపోర్ట్‌ చేస్తావంటూ నెటిజన్లు విమర్శలు చేయగా, మానవతా కోణంలో చేయడంలో తప్పేముందని యువీ సమర్ధించుకున్నాడు. (ఇక టెస్టులు ఆడటం నాకు సవాలే)

>
మరిన్ని వార్తలు