స్కూల్‌ బస్‌ బ్రేక్‌ ఫెయిల్‌

10 Feb, 2018 13:07 IST|Sakshi
తాటిచెట్టును ఢీకొట్టి ఆగిన ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు, దారుణమైన స్థితిలో ఉన్న బస్సు టైర్లు

చాకచక్యంగా వ్యవహరించి తాటిచెట్టును ఢీకొట్టిన డ్రైవర్‌

ఉలిక్కిపడిన చిన్నారులు

త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం

శ్రీకాకుళం , కవిటి: కంచిలిలోని ఓ పేరుపొందిన ప్రైవేట్‌ స్కూల్‌ బస్‌కు బ్రేక్‌ ఫెయిల్‌ అయింది. అందులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది చిన్నారులు ఉలిక్కిపడ్డారు. హాహాకారాలు చేసి ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సును రోడ్డుపక్కనే ఉన్న ఓ తాటిచెట్టుకు పక్కనుంచి ఢీకొట్టించి నిలిపేయడంతో చిన్నారులు ఊపిరిపీల్చుకున్నారు. కవిటి మండలం బాలాజీపుట్టుగ మలుపు వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచిలి నుంచి దూగానపుట్టుగ మీదుగా బి.గొనపపుట్టుగలోని విద్యార్థులను తీసుకువెళ్లేందుకు వస్తున్న స్కూల్‌ బస్సు సరిగ్గా బాలాజీపుట్టుగ మలుపు వద్దకు వచ్చే సమయానికి బ్రేక్‌ ఫెయిల్‌ అయింది. బస్సు యాక్సిలరేటర్‌ తక్కువ వేగంలోనే ఉన్నా రోడ్డు బాగా ఏటవాలులో ఉండడంతో బస్సు వేగం నియంత్రించలేనంతగా పెరిగింది. బస్సు వేగాన్ని నియంత్రించేందుకు డ్రైవర్‌ బ్రేక్‌ను తొక్కాడు.

కానీ బస్సు వేగం తగ్గలేదు సరికదా బాగా అదిమినా ఆగలేదు. ఇలా ఇరుకైన సింగిల్‌వే రోడ్డులో డ్రైవర్‌ చాకచక్యంగా అరకిలోమీటరు ప్రయాణించాడు. చివరకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రోడ్డుపక్కనే ఉన్న తాటిచెట్టుకు బస్సును పక్కనుంచి ఢీకొట్టించి ఆపేశాడు. పెద్దగా శబ్ధం రావడంతో సమీపంలో కొబ్బరి తోటల్లో ఉన్న రైతులంతా అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న పిల్లలకు ఏమైందోనని ఆందోళనతో బస్సులోకి వెళ్లారు. అదృష్టవశాత్తూ ఏ పిల్లవాడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే డ్రైవర్‌ను స్థానికులు దేహశుద్ధి చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానికంగా మోటార్‌వాహనాలపై అవగాహన ఉన్న వ్యక్తి బస్సు బ్రేక్‌ఫెయిల్‌ అయిందా అని డ్రైవర్‌ను ప్రశ్నించాడు. బస్సు కండిషన్‌ దారుణంగా ఉందని అతడు అంగీకరించాడు. ఐదారు నెలలుగా చెబుతున్నా యాజమాన్యం బస్సును మార్చడంలేదని తెలిపాడు. అంతేకాకుండా టైర్లు దయనీయమైన స్థితిలో ఉండడాన్ని చూసిన స్థానికులు బస్సులో ఉన్న పాఠశాల సిబ్బందిని నిలదీశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఈ విషయంలో శ్రద్ధతీసుకుని కాలంచెల్లిన బస్సులకు అనుమతులు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.

అప్పట్లో బాగానే ఉంది
దీనిపై ఇచ్ఛాపురం మోటార్‌వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ హరిప్రసాద్‌ను ‘సాక్షి’ సంప్రదించింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఏడాది ప్రారంభంలో తనిఖీల సమయంలో బస్సు బాగానే ఉందని మూడు నాలుగు నెలల్లోనే దారుణంగా మార్చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇలాంటి వాహనాలపై తక్షణమే తనిఖీలు నిర్వహించి అనుమతులపై పునఃసమీక్ష చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు