కాలేజీల్లో బయోమెట్రిక్ వ్యవస్థ

4 Sep, 2013 03:59 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రభుత్వ కళాశాలలు, పాలిటెక్నిక్‌లలో బోధన, బోధనేతర సిబ్బంది హాజరును పర్యవేక్షించడానికి  డిసెంబరులోగా బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశ పెట్టనున్నట్లు ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే వెల్లడించారు. నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం ఆయన తన శాఖ వంద రోజుల సాధనల సంక్షిప్త నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశ్వ విద్యాలయాల్లో కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా వైస్ ఛాన్సలర్లను కోరామని తెలిపారు.
 
  తన శాఖ పరిధిలోని 17 విశ్వ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలు, పాఠ్యాంశాలు వేర్వేరుగా ఉన్నాయని, ఇకమీదట ఏక రూప విధానాన్ని తీసుకు వస్తామని చెప్పారు. దీనిపై వైస్ చాన్సలర్లతో కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. వాణిజ్య శాస్త్రానికి డిమాండ్ అధికంగా ఉండడంతో ఈసారి అదనంగా 36 తరగతుల ప్రారంభానికి అనుమతినిచ్చామని వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలల్లో 2,800 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిలో 900 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు.
 
 పర్యాటకంపై విజన్ గ్రూపు
 రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహా ఇవ్వడానికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ టీవీ. మోహన్ దాస్ పాయ్ అధ్యక్షతన నిపుణులతో కూడిన విజన్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్లు దేశ్‌పాండే తెలిపారు. పర్యాటక శాఖను కూడా నిర్వహిస్తున్న ఆయన వంద రోజుల సంక్షిప్త నివేదికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ దీనికి సంబంధించి ప్రభుత్వ నోటిఫికేషన్ ఒకటి, రెండు రోజుల్లో విడుదలవుతుందన్నారు. పర్యాటకులకు, ప్రధానంగా మహిళలకు రక్షణ కల్పించడానికి గ్రీన్ పోలీసింగ్ దృక్పథాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.
 
  పర్యాటకులతో ఈ పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారని చెప్పారు. కాగా 11 దేశాల నుంచి బెంగళూరుకు వచ్చే పర్యాటకుల కోసం ఇటీవల తాము ప్రకటించిన ‘దిగిన వెంటనే వీసా’ పథకం ద్వారా విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. పర్యాటక సేవలను ఒకే గొడుగు కింద అందించే ఉద్దేశంతో ప్రపంచ సాంస్కృతిక కేంద్రాలైన హంపి, పట్టదకల్లుల్లో టూరిజం ప్లాజాలను నిర్మించాలనే యోచన ఉందని తెలిపారు. గత మే, జూన్‌లలో రాష్ట్రాన్ని కోటీ 76 లక్షలా 72 వేలా 602 మంది స్వదేశీ, 66,400 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు