బీజేపీలో తారాస్థాయికి వర్గపోరు

15 Nov, 2016 11:34 IST|Sakshi
అధ్యక్ష పదవి కోసం క్యాంపులు
కాషాయ పార్టీకి క్రమశిక్షణ సమస్యలు
నేడు జిల్లా అధ్యక్ష ఎన్నిక
 
సాక్షి, వరంగల్‌: భారతీయ జనతా పార్టీలో గ్రూపులు మొదలయ్యాయి. కాషాయ పార్టీ నేతలు పదవుల కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ వరంగల్‌ అర్బన్ జిల్లా అధ్యక్ష ఎన్నిక మంగళవారం జరగనుండగా.. ఆ పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. పదవి కోసం పోటీ పెరగడంతో దిగజారుడు వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ముఖ్యనేతలు పలువురు ఏకంగా క్యాంపు రాజకీయాలు నడిపిస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవిని ఎన్నికునే ఓటు హక్కు ఉన్న ఆఫీసు బేరర్లను క్యాంపులకు తరలించి ’సంతృప్తి’ పరుస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఇలాంటి పరిస్థితి రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిద్ధాంత పార్టీగా చెప్పుకునే బీజేపీలో క్యాంపు రాజకీయాల ధోరణలు రావడంపై కమలం పార్టీ ప్రతిష్టకు ఇబ్బందులు తెస్తున్నాయి. 
 
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాలకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ అర్భన్ జిల్లా అధ్యక్ష పదవి కోసం సీనియర్‌ నేతలు రావు పద్మ, చాడ శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్ పోటీపడుతున్నా రు. బీజేపీలో జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. అధ్య్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్న ఇద్దరు నేత లు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. ఎప్పుడూ లేని విధంగా డబ్బు, మద్యంతో ప్రత్యేకంగా క్యాంపులలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అధ్యక్ష పదవిని ఆశిస్తు న్న నేతలు ఒక్కో ఓటరుకు రూ.10 వేల వరకు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. అధ్యక్ష పదవిని ఆశిస్తు న్న ఓ నేత... ఓటర్ల సంఖ్యను 94 నుంచి 124 కు పెంచినట్లు చెబుతున్నారు. ఓటర్లను తమ వారిగా అనుపించుకునేందుకు హన్మకొండలోని రెండు ప్రదేశాల్లో ప్రత్యేకంగా క్యాంపు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు.
 
ఓటింగ్‌పై ఆసక్తి... 
జిల్లాలో నగరంలోని 58 డివిజన్ లతో పాటు హసన్ ప ర్తి, కమలాపురం, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఐనవోలు, వేలేరు మండలాలు ఉన్నాయి. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని డివిజన్ల బీజేపీ అధ్యక్షులు, మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రస్తుత జిల్లా కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు... లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గ కన్వీనర్లు, రాష్ట్ర కమిటీ ఆఫీసు బేరర్లు, రాష్ట్ర కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షుల్లో జిల్లాకు చెందిన వారికి జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. వరంగల్‌ అర్బన్ జిల్లాలో మొత్తం 124 ఓట్లు ఉన్నాయి. హన్మకొండలోని మహేశ్వరీ గార్డెన్ లో మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే జిల్లా అధ్యక్ష ఎన్నికలకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ఎన్నిక ఇంచార్జీగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర నేతలు శ్యాంసుందర్, నందకుమార్‌లు ఎన్నిక ప్రక్రియకు హాజరవుతున్నారు. కొత్త కమిటీ ఎన్నికపై సమావేశం జరగతుంది. అందులో ఓటు హక్కు కలిగిన వారి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత అధ్యక్షుడి ఎన్నికపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అధ్యక్ష పదవిని ఆశించేవారు ఓటింగ్‌కు పట్టుబడితే ఎన్నికల ఇంచార్జీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.  
మరిన్ని వార్తలు