లాక్‌డౌన్‌లో గుడ్‌న్యూస్‌: బేకరీలకు మినహాయింపు

7 Apr, 2020 11:40 IST|Sakshi

బెంగళూరు : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నిత్యావసర, అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా మినహాయింపును ఇచ్చారు. ఇక లాక్‌డౌన్‌తో రెస్టారెంట్లు, హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ఆహార ప్రియులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ రాష్ట్రంలోని ఆహార ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. లాక్‌డౌన్‌ నుంచి బేకరీలకు మినహాయింపు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది.     

బిస్కెట్లు, బ్రెడ్‌, స్వీట్లు తయారు చేసి సప్లయి చేస్తున్న బేకరీలు కొద్ది మంది సిబ్బందితో నాణ్యత ప్రమాణాలతో నడపాలని ఆదేశించినట్లు ప్రభుత్వ అధికారి రాజేంద్రకుమార్‌ కటారియా పేర్కొన్నారు. అదేవిధంగా బేకరీల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, కస్టమర్లు సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. అయితే బేకరీల్లో డైనింగ్‌కు అనుమతి లేదని కేవలం పార్శిళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. 

తయారీ మొత్తం పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించకపోతే ఆ బేకరీని వెంటనే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఇక ప్రజలకు ఆహార పదార్థాలు అందించే బేకరీలకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు కల్పించింది. అయితే వీటిపై పూర్తి నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించింది. 

చదవండి:
డాక్టర్లపై లాఠీఛార్జ్‌.. అరెస్ట్‌
లాక్‌డౌన్‌: ‘ఖైదీననే భావన కలుగుతోంది’
దేశం కోసం ఓ మంచి పని చేద్దాం

>
మరిన్ని వార్తలు