ఉత్సాహంగా పుణే మారథాన్

1 Dec, 2013 23:48 IST|Sakshi

 పింప్రి, న్యూస్‌లైన్: పుణే అంతర్జాతీయ మారథాన్ ఆసక్తికరంగా సాగింది. ఆదివారం ఉదయం డెక్కన్ ఖండోజీ బాబా చౌక్ నుంచి ప్రారంభమైన ఈ పోటీల్లో ముందునుంచి అనుకున్నట్టుగానే పురుష, మహిళల విభాగాల్లో ఇథియోపియో అథ్లెట్లే సత్తా చాటారు.  బేలాచు ఎండలే అబానేహ పురుషుల ఫుల్ మారథాన్‌ను నెగ్గి కెరీర్‌లో తొలి టైటిల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల, మహిళల హాఫ్ మారథాన్‌లో హబతాము అర్గా, అబేరూ జూహూదె తేసేమా నెగ్గి రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఇథియోపియన్ అథ్లెట్లు మూడు బంగారు పతకాలను తమ ఖాతాలో వేసుకున్నట్టయ్యింది. తమకు పోటీగా వచ్చిన కెన్యా అథ్లెట్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కాగా, పురుషుల ఫుల్ మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్ బేలాచు ఎండలే అబానేహ 2.17.52 సెకన్లలో 42 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుకొని తొలి స్థానంలో నిలిచాడు.
 
  కెన్యా అథ్లెట్ ఎజికియల్ చెరోప్ 2.18.16 సెకన్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఖడికిలోని బాంబే ఇంజనీరింగ్ గ్రూప్ నుంచి ఉదయం 7 గంటల 20 నిమిషాలకు ప్రారంభమైన హాఫ్ మారథాన్‌లో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే విజేతలుగా ఇథియోపియన్ అథ్లెట్లే నిలిచారు. తర్వాత స్వార్‌గేట్ వద్ద గల నెహ్రూ స్టేడియంలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు సురేష్ కల్మాడీ, నగర మేయర్ చంచలా కోద్రే తదితరులు పాల్గొన్నారు.
 
 ప్రభావం చూపని భారత్ అథ్లెట్లు
 రాష్ట్ర సహకార మంత్రి హర్షవర్ధన్ పాటిల్, ప్రముఖ క్రీడాకారిణి (షూటర్) అంజలీ భగావల్ ప్రారంభించిన ఈ మారథాన్‌లో భారత్ అథ్లెట్లు ప్రభావం చూపలేదు.  నాసిక్‌కు చెందిన భికు కైర్‌నర్ 2.27.04 సెకన్లలో గమ్యాన్ని చేరి బెస్ట్ టైమింగ్ నమోదు చేసి 16వ స్థానంలో నిలిచాడు. స్థానిక అథ్లెట్లు కే.మూర్తి (2.51.51), విజయ్ అహీర్ (3.03.33) 23, 26వ స్థానాల్లో నిలిచారు.

మరిన్ని వార్తలు