అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు

24 Aug, 2015 01:05 IST|Sakshi
అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు

♦ తెలుగు ప్రజలను మహారాష్ట్ర అక్కున చేర్చుకుందన్న తెలుగు జాగృతి అధ్యక్షురాలు కవిత
♦ స్వాతంత్య్రానికి ముందే ఇరు రాష్ట్రాల మధ్య సోదరభావం
♦ తెలంగాణ భవన్ ఏర్పాటుకు కృషి నిర్వహిస్తాం
♦‘జాగృతి’ రాష్ట్ర శాఖ ఆవిర్భావ సభలో నిజామాబాద్ ఎంపీ
 
 సాక్షి, ముంబై : ‘స్వాతంత్య్రానికి ముందు నుంచే తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సోదరభావం నెలకొని ఉంది. భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడ్డ సమయంలో ఇరు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు విడిపోయాయి. ఇరు రాష్ట్రాలు కవలల వంటివి. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనల్లో 369 మందిని తుపాకులతో కాల్చేశారు. ఆ సమయంలోనే మహారాష్ట్రకు చెందిన వివేకవర్ధిని పత్రిక.. ఉద్యమానికి, ఉద్యమకారులకు బాసటగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ కేంద్రంగా వివేకవర్ధిని మారిందంటే ఆ సమయంలో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సోదరభావం ఎలాంటిదన్నది స్పష్టమవుతోంది.

మహారాష్ట్రలో తెలంగాణ ప్రజలు మమేకమై పోయారు. తమ సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఇక్కడి సంస్కృతిని గౌరవిస్తున్నారు. తెలంగాణ బిడ్డలను అక్కున చేర్చుకున్న మహారాష్ట్రకు కృతజ్ఞతలు’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ముంబైలో ‘తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ’ ఆవిర్భావ సభ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతకు కృషి చేస్తామని తెలిపారు.

 తెలంగాణ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తాం
 ముంబైలో తెలంగాణ భవనం ఏర్పాటుకు కృషి చేస్తామని కవిత పేర్కొన్నారు. గత ఫిబ్రవరి నెలలో ‘ఓం పద్మ శాలి సేవా సంఘం’ పసుపు కుంకుమ సమయంలో ఇక్కడి సంఘాలు, ప్రజలు తమ సమస్యలను తెలిపారని చెప్పారు. మహారాష్ట్రలోని తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కరానికి, అభివృద్ధికి జాగృతి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సీఎం ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తెలంగాణ భవనం ఏర్పాటు గురించి చర్చించారన్నారు. వందల ఏళ్లుగా తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటున్నారని, ఇక్కడి ప్రజల కోసం తెలుగు భాషకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని కవిత చెప్పారు.

పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా చేయాలన్న ప్రతిపాదన ఉందని, అది అమలయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించే విషయంపై తొందర్లోనే ప్రకటన విడుదల చేస్తామని కవిత చెప్పారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగను ఇక్కడి ఆడబిడ్డల కోసం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.

 తొక్కుడ బండలా ఓపిక ఉండాలి
 తెలంగాణ జాగృతి సంస్థ ఐక్యంగా ముందుకు సాగుతుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి మహారాష్ట్ర శాఖ కూడా ఇదే పద్దతిలో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గం, ఇతర సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘తొక్కుడు బండ’లా ఓపిక ఉండాలని సూచించారు. సంస్థ సిద్ధాంతాలు, నియమనిబంధనలను అందరు పాటించాలని అన్నారు.

 పుస్తకాలు తీసుకొస్తాం
 మహారాష్ట్రలోని తెలంగాణ వారి చరిత్ర, వారు చేసిన సేవల గురించి తెలంగాణ జాగృతి తరఫున పుస్తకాలు తీసుకొస్తామని కవిత తెలిపారు. ‘మహారాష్ట్ర తొలి స్పీకర్ తెలుగు వ్యక్తేనన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఇలాంటి చాలా విషయాలను సేకరిం చి జాగృతి పుస్తకాలు తెస్తాం’ అని చెప్పారు.

 ఆకట్టుకున్న కార్యక్రమాలు
 జాగృతి అవిర్భావ సభలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. వందేమాతరం శ్రీనివాస్ పాడినపాటలు, రసమయి బృందానికి చెందిన సాయిచంద్, మల్లేశ్ ఆలపించిన పాటలు తెలంగాణ ప్రాంత అనుభూతిని కలిగించాయి. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా...  పోరు తెలంగాణమా...’ వంటి పాటలు మనసులను తాకాయి. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై మహారాష్ట్ర అనే నినాదాలతో సభ దద్దరిల్లింది. గాజుల నర్సారెడ్డి ఆధ్వర్యంలో బోరివలికి చెందిన మహిళలు డప్పులతో బోనాలు, బతుకమ్మలతో కవితకు స్వాగతం పలికారు.

1969లో తెలంగాణ కోసం ముంబైలో కృషి చేసిన ముంబైకి చెందిన 85 ఏళ్ల రామదాస్‌ను కవిత సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, గాయకులు, కవి దేశపతి శ్రీనివాస్, సంగీత దర్శకులు, గాయకులు వందేమాతరం శ్రీనివాస్, మహారాష్ట్ర జాగృతి ప్రధాన కార్యదర్శి అశోక్ రాజ్‌గిరి, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, తుత్తురు వెంకటేశ్వర్, ఎస్ వేణుగోపాల్, ఎ మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.
 
 చెమట సూర్యుళ్లు
 మహారాష్ట్రలోని తెలంగాణ ప్రజలు చెమట సూర్యుళ్లు. మరాఠీ, తెలుగు భాషలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటే. రాష్ర్టంతో తెలంగాణ ప్రజల బంధం ఈ నాటిది కాదు. ఈ బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తాం   
 -దేశపతి శ్రీనివాస్
 
 సమష్టి ప్రయోజనాల కోసం
 తెలంగాణ ప్రజల సమష్టి ప్రయోజనాల కోసం కృషి చేస్తాం. ఇక్కడి తెలంగాణ యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తాం.     
     -సుల్గే శ్రీనివాస్
 
 సోదరుడున్నాడని మరవద్దు
 తెలుగు ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటా. వర్లీలో పద్మశాలి బాంధవుల కోసం పద్మశాలి భవనం కట్టిస్తాను. స్థలం చూపిస్తే చాలు. తెలుగు ప్రజలందరికీ ఒక సోదరుడున్నాడనే విషయం మాత్రం మరవొద్దు.
     -ఎంపీ అరవింద్ సావంత్
 
 మరాఠీ తల్లి, తెలుగు పినతల్లి
 మాకు మరాఠీ భాష తల్లి అయితే తెలుగు భాష పినతల్లి వంటిది. వర్లీలో తెలుగు ప్రజలతో నిత్యం భేటీ అవుతుంటా. ఈ సారి కలిసినప్పుడు మాత్రం తప్పనిసరిగా తెలుగు నేర్చుకుని తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నిస్తా’          
 - వర్లీ ఎమ్మెల్యే సునీల్ షిండే

మరిన్ని వార్తలు