ప్రేమ పెళ్లే బెటర్..: లక్ష్మీ గోపాలస్వామి

19 Oct, 2016 14:14 IST|Sakshi
ప్రేమ పెళ్లే బెటర్..: లక్ష్మీ గోపాలస్వామి

లక్ష్మీ గోపాలస్వామి  భారతనాట్య కళాకారిణి, ‘ఉత్తమ’ బహుభాష నటి, ట్యాలెంట్‌షో జడ్జి... ఇలా విభిన్నప్రతిభావంతురాలైన ఆమె జువెల్స్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఏడాది బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన కెరీర్‌తో పాటు తెలుగు సినిమాలో నటించాలన్న ఆసక్తిని వ్యక్తపరిచారు. ఇక ప్రేమ పెళ్లి ఉత్తమమని చెబుతున్న లక్ష్మీ గోపాలస్వామికి వివిధ విషయాలపై ఉన్న అభిప్రాయలు ఆమె మాటల్లోనే...

సంప్రదాయ నృత్యం... క్రమశిక్షణను నేర్పిస్తుంది

ఇంత పేరుప్రఖ్యాతలు రావడానికి స్థితిలో ఉండటానికి మొదటి కారణం భరతనాట్యమే. ఈ నృత్యం నాకు క్రమశిక్షణను, సమయ పాలనను నేర్పించింది. పెద్దలను ఎలా గౌరవించాలో చూపించింది. మొదట నాట్యకారిణిగా గుర్తింపబడటానికి ఇష్టపడుతాను. అటు పై మాత్రమే మిగిలిన రంగాల్లో నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఆస్వాధిస్తాను. అందువల్లే పిల్లలకు ఏదో ఒక సంప్రదాయ నృత్యంలో శిక్షణ ఇప్పించాలని చెబుతా. దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆత్మ విశ్వాసం వారు ఎంచుకునే రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో  ఓ మంచి డ్యాన్స్‌ స్కూల్‌ ప్రారంభించే ఆలోచన ఉంది.

సినిమా...: ‘నేటి మహిళ’ రోల్‌ వస్తే తెలుగులో.. నటీనటులకే ఎక్కువ అవకాశాలు

భాష ఏదైనా భావం. అభినయం ముఖ్యమని నమ్ముతా. నేను కళ్లతో వివిధ భావాలను అవలీలగా పలికిస్తుంటాను. అందువల్లే మళయాలం, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో మంచి నటిగా పేరుంది.  ఇందుకు నాకు భరత నాట్యంలో ఉన్న అనుభవమే కారణం.  మళయాలంలో ఎక్కువ అవకాశాలు రావడం వల్లే ఆ ఇంటస్ట్రీలో బిజీ అయ్యాను. ప్రస్తుతం నేను హీరోయిన్‌ (నవ్వుతూ) వేషాలు వెయ్యలేనని తెలుసు.

అందువల్ల ‘నేటి భారతీయ మహిళ’ తరహా క్యారెక్టర్లు వస్తే తెలుగులో నటించడానికి సిద్ధం. ఇంచుమించు ఇలాంటి తరహా రోల్‌ అంటే మధ్యతరగతి గృహిణిగా నటించినందుకే నాకు ‘విధాయ’ సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. ఇప్పుడిప్పుడే అన్ని చిత్రసీమలు మూసధోరణి నుంచి బయటికి వచ్చి కొత్త తరహా సినిమాలు నిర్మిస్తున్నాయి. అందువల్ల హీరో, హీరోయిన్ల కంటే నటీ నటీలకు మంచి అవకాశాలు, పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి.

టీవీ.. టాలెంట్‌షో...: ఫేమ్‌ లేకపోయిన జీవించడం నేర్పించాలి...

చలనచిత్ర సీమతో సమానంగా టీవీ రంగంలోని నటీనటులకు పేరొస్తోంది. ఇందుకు విభిన్న అంశాలతో కూడిన కార్యక్రమాలు రూపొందించడమే. టాలెంట్‌షోల వల్ల పిల్లలలో దాగున్న నైపుణ్యం వెలికి వస్తోంది. ‘తకథిమి’ కార్యక్రమం జడ్జిగా ఇది నా స్వానుభవం. అయితే ఇక్కడ మరో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్న వయసులో వచ్చే పేరు ప్రఖ్యాతలు చాలా మందిలో అలాగే కొనసాగవు. ఇందుకు రకరకాల కారణాలు ఉంటాయి. ఈ సమయంలో సదరు పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించి ఫేమ్‌ లేకపోయినా ఎలా జీవించాలో నేర్పించాలి. ఇక సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారికి మాత్రమే టీవీ రంగం ఆదరిస్తుంది అనడం సరికాదన్నది నా అభిప్రాయం. ఎంతో మంది టీవీ ఆర్టిస్టులు పెద్ద పెద్ద నటీనటులతో సమానంగా రెమ్యునురేషన్‌ తీసుకుంటున్నారు.

ఆభరణాలు...: పురాణాలు దాగి ఉంటాయి

అందరి అమ్మాయిల వలే నాకు ఆభరణాలంటే ఇష్టం. అందులోనూ సంప్రదాయాలను ప్రతిబింభించే నగలు ఎక్కువగా ధరిస్తా. మిగిలిన దేశాలతో పోలిస్తే భారతీయ నగల్లో పురాణాలు దాగి ఉంటాయి. నగలను కూడా భక్తితో పూజించే సంస్కృతి మన వద్ద మాత్రమే ఉంది. మనకు నచ్చిన నగలనే కొనాలి. అప్పుడు మాత్రమే నగలు ధరించడానికి ఆస్వాదించగలుగుతాము.

ప్రేమించే పెళ్లి చేసుకుంటా...

ప్రేమ, పెళ్లి వేర్వేరు కాదని నా అభిప్రాయం. నేను మాత్రం ప్రేమించే పెళ్లి చేసుకుంటా. ఏదో నా అందం చూసి సమాజంలో నా గౌరవం చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే వారు నాకు అవసరం లేదు. ఇవి ఏవీ లేకపోయినా నన్ను నన్నుగా ఇష్టపడే వాడిని పెళ్లి చేసుకుంటా. ఇక నన్ను ఎంత గౌరవంగా చూసుకుంటాడో అంతే గౌరవాన్ని ఉదాహరణకు వెయిటర్, జంతువులకు ఇవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అందం, ఆస్తికంటే మానవత్వం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.

మరిన్ని వార్తలు