అర్ధరాత్రి మద్యం కోరికకు 'మహా' చిట్కా

1 Sep, 2015 16:53 IST|Sakshi
అర్ధరాత్రి మద్యం కోరికకు 'మహా' చిట్కా

అప్పటిదాకా సేవించిన మద్యం ఇచ్చిన కిక్కు సరిపోదు. ఇంకా తాగాలనిపిస్తుంది. సమయం అర్దరాత్రి దాటింది. వైన్ షాపుల షట్టర్లన్నీ తాళలు వేసుంటాయి. ఎలా? ఒక్క బుక్క తాగితే చాలు, హాయిగా నిద్రపోవచ్చు, కానీ మందు దొరకదు.. ఇప్పుడెలా?.. ఈ తరహా బాధలకు త్వరలోనే కాలం చెల్లిపోనుంది.

అర్దరాత్రా, పట్టపగలా అన్నిది మీ ఇష్టం ఇక ఎంతంటే అంత తాగి.. తందనాలొడొచ్చు. ఎందుకంటే ఇంట్లో దాచుకునే మద్యం బాటిళ్ల సంఖ్యను రెండు నుంచి ఏకంగా 12కు పెంచేసింది ప్రభుత్వం. బాధాకరమైన విషమేమంటే ఈ నిర్ణయం తీసుకున్నది తెలుగు రాష్ట్రాలు కావు. ముంబై రాజధానిగా గల మహారాష్ట్ర!

ఆ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఇంట్లో రెండు మద్యం బాటిళ్ల కంటే ఎక్కువ నిలువ ఉంటే నేరంగా పరిగణించేవారు. ఆ సంఖ్యను ఇప్పుడు 12కు పెంచుతుండటంతో మందు బాబులు హర్షాతిరేకాలు ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన జీవోను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే మంగళవారం ముంబైలో ప్రకటించారు.

మద్యం ప్రియులను సంతోషపెట్టే ఈ నిర్ణయం వెనుక గొప్ప విషాదం దాగుండటం గమనార్హం. మూడు నెలల కిందట మహారాష్ట్రలోని మల్వానీ ప్రాంతంలో కల్తీసారా తాగి 100 మందికిపైగా మృత్యువాత పడిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మందికి సారా తాగే అలవాటు లేనప్పటికీ, అర్ధరాత్రి కావడంతో సాధారణ మద్యం దొరకని కారణంగా వారు సారాయి సేవించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషాదంపై క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన ఫడ్నవిస్ సర్కారు.. మద్యం అందుబాటులో లేకపోవడం వల్లే జనం కల్తీసారాను ఆశ్రయిస్తున్నారని గుర్తించింది. అందుకే ఇంట్లో నిల్వ ఉంచుకునే మద్యం బాటిళ్ల సంఖ్యను 12కు పెంచింది.

మరిన్ని వార్తలు