బెస్ట్ ఏసీ బస్సులతో పోటీ పడుతున్న ఎన్‌ఎన్‌ఎంటీ

2 Feb, 2015 22:39 IST|Sakshi

సాక్షి, ముంబై : బహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సంస్థ నడుపుతున్న ఏసీ బస్సులకు నవీముంబై మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ (ఎన్‌ఎంఎంటీ) బస్సుల నుంచి పోటీ ఎదురవుతోంది. బెస్ట్ ఏసీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గుతుండగా, ఎన్‌ఎంఎంటీ బస్సులు మాత్రం నగరవాసుల ప్రశంసలందుకుంటున్నాయి. బెస్ట్ సంస్థ వడాలా నుంచి కలంబోలి వరకు నడుస్తున్న చైనా మేడ్ కింగ్‌లాంగ్ బస్సులు తరచూ బ్రేక్ డౌన్‌లకు గురవుతున్నాయి.

దీంతో రోజువారి ప్రయాణికులు విసుగు చెందడంతో ఈ ఏసీ బస్సులకు ఆదరణ తగ్గుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే మార్గంలో ఎన్‌ఎంఎంటీ బస్సు సేవలను ప్రారంభించడంతో బెస్ట్ ఆదాయానికి గండిపడినట్లుగా అధికారులు పేర్కొన్నారు. బెస్ట్ సంస్థ ఇప్పటికీ పురాతన చైనా మేక్ ఎయిర్ కండీషన్డ్ బస్సులను నడుపుతోంది. కానీ ఎన్‌ఎంఎంటీ ఆధునాతన వోల్వో బస్సులను కొనుగోలు చేసి రోడ్డుపెకైక్కించింది. వోల్వో బస్సుల్లో ప్రయాణించేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.

బెస్ట్ బస్సు చార్జీలకంటే కూడా ఎన్‌ఎంఎంటీ బస్సు చార్జీలు తక్కువగా ఉన్నాయి. వోల్వో బస్సుల నిర్వహణ, సమయ పాలన కూడా సక్రమంగా ఉండడంతో పాటు అప్పుడప్పుడు మాత్రమే అవి మరమ్మతులకు లోనవుతుంటాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు ఎన్‌ఎంఎంటీ బస్సులవైపే మొగ్గు చూపుతన్నారు. దీంతో ఏసీ బస్సులను ఉపసంహరించాలని బెస్ట్ సంస్థ యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ బస్సులను దశల వారీగా తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తొలుత వడాలా నుంచి నవీముంబైలోని కలంబోలి మార్గాల మధ్య బెస్ట్ నడుపుతున్న (ఏఎస్-503) ఏసీ బస్సును ఈ నెల నుంచి నిలిపి వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు