హిందూ నేతలపై దాడులు అరికట్టాలి

29 Sep, 2016 01:44 IST|Sakshi

టీనగర్: హిందూ సంస్థల నిర్వాహకులపై దాడులను అరికట్టేందుకు పోలీసులు చర్యలు గైకొనాలంటూ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఆందోళన జరిగింది. ఈ ఆందోళనకు పోలీసుల అనుమతి లేకపోవడంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా సహా కార్యకర్తలు ఐదు వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరుకు చెందిన హిందూ మున్నని నేత శశికుమార్ కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇదివరకే దిండుగల్, కన్యాకుమారి జిల్లాలలో హిందూ సంస్థలకు చెందిన నిర్వాహకులు హత్యకు గురయ్యారు. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం రాజరత్నం స్టేడియం సమీపాన ఆందోళన జరపనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దీంతో బుధవారం ఉదయం నుంచే బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఈ ఆందోళనకు పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.

ఇందులో జాతీయ కార్యదర్శి హెచ్ రాజా, రాష్ట్ర కార్యదర్శి రాఘవన్, చెన్నై జిల్లా ఇంచార్జి నేత చక్రవర్తి, ఉపాధ్యక్షుడు శంకర్ సహా 700 మంది పాల్గొన్నారు. ఆందోళనలో హిందూ సంస్థ నిర్వాహకులను హతమారుస్తున్న వారిని అరెస్టు చేయడంలోను, హత్యల గురించి నేరపరిశోధన జరపడంలో పోలీసుల ఉదాసీన వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఇలావుండగా ఆందోళనకు అనుమతి లేదని తెలుపుతూ పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులు హఠాత్తుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు తమిళిసై సహా 700 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. వీరందరినీ వ్యానులో ఎక్కించి సమీపాన ఉన్న మండపాలలో నిర్బంధించారు.

 దీంతో ఆ ప్రాంతాలలో సంచలనం ఏర్పడింది. ఈ సందర్భంగా తమిళిసై విలేకరులతో మాట్లాడుతూ హిందూ సంస్థలైన ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ వంటి సంస్థల నేతలు రాష్ట్రంలో హత్యకు గురికావడం పరిపాటిగా మారిందని, హంతకులపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనికి నిరసనగా తాము ఆందోళనలు జరిపేందుకు పోలీసుల అనుమతి కోరగా నిరాకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఆందోళన చేపట్టామని తెలిపారు.సీబీసీఐడీకి శశికుమార్ హత్య కేసు: కోయంబత్తూరులో తీవ్ర సంచలనాన్ని కలిగించిన హిందూ మున్నని నేత శశికుమార్ హత్య కేసు సీబీసీఐడీకి మార్చబడింది. శశికుమార్ హత్య కేసులో మిస్టరీ ఛేదించేందుకు డీఐజీ నాగరాజన్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఈ కేసులో అనేక అధారాలను సేకరిస్తున్నారు. అయినప్పటికీ హత్య జరిగి వారం రోజులైనా కేసులో పురోగతి లేనందున ఈ కేసును సీబీసీఐడీ పోలీసు విచారణకు మార్పు చేస్తూ డీజీపీ రాజేంద్రన్ ఆదేశాలిచ్చారు.

బీజేపీ నేత దుకాణానికి నిప్పు:
దుకాణాల బంద్: తిరుపూర్-ధారాపురం రోడ్డు ప్రాంతానికి చెందిన వ్యక్తి శివ అలియాస్ రన్నింగ్ శివ(35). బీజేపీ నేత అయిన ఇతను రన్నింగ్ ట్రేడర్ పేరుతో కాంగేయం క్రాస్ రోడ్డులో బనియన్ సంస్థకు అవసరమైన ఆయిల్, యంత్రాల విడిభాగాలను విక్రయించే దుకాణం నడుపుతున్నారు. మంగళవారం రాత్రి వ్యాపారం ముగించుకుని రన్నింగ్ శివ ఇంటికి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు రన్నింగ్ శివ దుకాణ ంపై పెట్రోలు కుమ్మరించి నిప్పంటించారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు ప్రజల సహకారంతో మంటలను అర్పివేశారు. అయినప్పటికీ దుకాణంలోని ఆయిల్, టీవీ, యంత్రాల విడిభాగాలు కాలిపోయాయి. ఈ విషయం తెలియగానే హిందూ మున్నని, బీజేపీ నేతలు, కార్యకర్తలు దుకాణం ఎదుట గుమికూడి రాస్తారోకో జరిపారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్లమని కోరగా వారు నిరాకరించారు. దీంతో పోలీసులు, బీజేపీ వర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ సంఘటనతో కాంగేయం ప్రాంతంలోని దుకాణాలను మూసివేశారు. దీంతో అక్కడ సంచలనం ఏర్పడింది.
 

>
మరిన్ని వార్తలు