మిస్టరీ.. హిస్టరీ!

19 Aug, 2017 12:43 IST|Sakshi
 
 32 ఏళ్లలో 19 విచారణ కమిషన్లు
 అన్నీ అవాంఛనీయ సంఘటనలకు ఇదే మంత్రం
 తాజాగా జయలలిత మృతిపైనా మరో విచారణ కమిషన్‌
 
 
రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ప్రజలను, ప్రతిపక్షాలను శాంతపరిచేందుకు విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడమే ప్రభుత్వాల లక్ష్యంగా మారింది. 32 ఏళ్లలో ఇప్పటివరకు 19 విచారణ కమిషన్లను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీని ఛేదించేందుకంటూ ఎడపాడి ప్రభుత్వం మరో కమిషన్‌ను ప్రకటించడం గమనార్హం.
 
సాక్షి, చెన్నై: దాడులు, పోరాటాలు, తుపాకీ కాల్పులు, తొక్కిసలాటలో దుర్మరణాలు ఇలా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ప్రజలను, ప్రతిపక్షాలను శాంతింపజేసేందుకు విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయడమే ప్రభుత్వాల ఏకైక మంత్రంగా మారింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కమిషన్‌ ఏర్పాటుతో కన్నీళ్లు తుడవడం మాత్రం షరామామూలుగా మారింది. ఇప్పటి వరకు ఏర్పాటైన 19 విచారణ కమిషన్ల వల్ల బాధితులకు ఎంతవరకు న్యాయం జరిగింది అనే ప్రధాన అంశాలు మాత్రం (ఏవో ఒకటి రెండు మినహా) వెలుగు చూడకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. తాజాగా, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రకటించి ఈ సంఖ్యను 20 కి పెంచారు. 1995 నుంచి 2017 ఆగస్టు వరకు రాష్ట్రంలో ఏర్పాటైన విచారణ కమిషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 
 
- దక్షిణాది జిల్లాల్లో 1995 జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో చోటు చేసుకున్న జాతి కలవరాలపై న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌.
- చెన్నై సెంట్రల్‌ జైల్లో 1999 నవంబర్‌లో జరిగిన ఘర్షణలో డిప్యూటీ జైలర్‌ జయకుమార్‌ సజీవ దహనం కాగా, ఈ సందర్భంగా జరిగిన తుపాకీ కాల్పుల్లో 11 మంది ఖైదీలు ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనపై రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌.
- మాంజోలైలో తేయాకు తోటల కార్మికుల కూలీల సమస్యపై నిర్వహించిన ఊరేగింపులో ఘర్షణలు చోటు చేసుకోగా, పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సమయంలో తామరభరణి చెరువులో మునిగిపోయి 17 మంది మృత్యువాతపడ్డారు. దీనిపై 1999లో న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌
- చెన్నైలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ లా కళాశాల హాస్టల్‌లోకి 2001లో పోలీసులు చొరబడి దాడికి పాల్పడిన సంఘటనపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌.
- డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని 2001లో అర్ధరాత్రి అరెస్టు చేయడంపై న్యాయమూర్తి  నేతృత్వంలో విచారణ కమిషన్‌.
- డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అరెస్టును నిరసిస్తూ 2001 ఆగస్టులో నిర్వహించిన ర్యాలీలో ఐదుగురు మరణించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న విధ్వంసాలపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌
- సమ్మెకు దిగిన 1,70,241 మంది ప్రభుత్వ ఉద్యోగులను 2001లో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం విధుల నుంచి శాశ్వతంగా తొలగించడంపై ముగ్గురు రిటైర్డు న్యాయమూర్తులచే విచారణ కమిషన్‌
- మదురై మేలూరు ప్రభుత్వ కళాశాలలో 2002లో విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్‌. ఈ విచారణ కమిషన్‌ మాత్రమే పోలీసులను తప్పుపట్టడంతో పాటు, కళాశాలనే మరో చోటుకు మార్చాలని సిఫార్సు చేసింది.
- అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో వెంకటేశ పన్నయార్‌ అనే వ్యక్తి పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంపై న్యాయమూర్తి రామన్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌.
- కుంభకోణం పాఠశాలలో దారుణ అగ్నిప్రమాదంపై న్యాయమూర్తి నేతృత్వంలో 2004లో విచారణ కమిషన్‌.
- చెన్నై ఎంజీఆర్‌ నగర్‌లో 2005 ఆఖరిలో వరద నివారణ పంపిణీలో తొక్కిసలాట జరిగి 42 మంది మృతి చెందిన సంఘటనపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌. 
- చెన్నై ప్రభుత్వ న్యాయకళాశాలలో 2008లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌.
- జయలలిత విశ్రాంతి కోసం నిర్మాణం చేసిన సిర్ధాఊరు బంగళా నిర్మించిన స్థలం అన్నాదురై పాలన కాలంలో దళితులకు పంపిణీ చేసిన పట్టా భూమి అని, అప్పట్లో కమ్యూనిస్టులు పోరాడారు. దీనిపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌
- సేలంలోని ఓమలూరు పాతిమా పాఠశాలలో సుకన్య అనే విద్యార్థిని అనుమానాస్పద మృతిపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌
- టెలిఫోన్‌లో ఓట్ల ప్రచారంపై 2010లో న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌.
- కొత్త సచివాలయం నిర్మాణం గురించి విచారణ కోసం 2011లో ఏర్పాటైన కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ న్యాయమూర్తి నియామకమయ్యారు.
- మౌళివాక్కంలో 2014 జూన్‌లో బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్‌ కూలిపోయిన దుర్ఘటనపై రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌.
- తమిళనాడులో ఇసుక క్వారీల దోపిడీపై హైకోర్టు ఆదేశాల ప్రకారం 2014లో ఐఏఎస్‌ అధికారి సహాయం నేతృత్వంలో విచారణ కమిషన్‌
- 2017 జనవరిలో జరిగిన జల్లికట్టు పోరాటం, ఆందోళనపై రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌.
 
జయ మరణ మిస్టరీపైనా విచారణ కమిషన్‌
గత ఏడాది సెప్టెంబరు 22 వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరారు. జ్వరం, డీహైడ్రేషన్‌ వల్ల స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. జయ కోలుకున్నారు, నేడో రేపో డిశ్చార్జ్‌ అంటూ అపోలో వైద్యులు, అన్నాడీఎంకే వర్గాలు నెలల తరబడి ప్రకటిస్తూ వచ్చాయి. అయితే 74 రోజుల పాటు చేసిన ప్రకటనలకు పూర్తి భిన్నంగా.. జయలలిత కన్నుమూసినట్లుగా డిసెంబర్‌ 5వ తేదీన చావుకబురు చల్లగా చెప్పారు. అభిమానులు, ప్రజలు, ప్రతిపక్షాలు అమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. న్యాయవిచారణ, సీబీఐ విచారణ కోరుతూ డిమాండ్లు చేశారు. ఎవరెంత గీ పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. ఎడపాడి, పన్నీర్‌ వర్గాలు ఏకం కావాలని ప్రధాని ఒత్తిడి, శశికళ కుటుంబాన్ని దూరం పెట్టాలని పన్నీర్‌ సెల్వం షరతు, పార్టీపై పట్టు కోసం టీటీవీ దినకరన్‌ దూకుడు పెంచి ప్రభుత్వ మనుగడకే ముప్పువాటిల్లే తరుణంలో జయ మరణంపై రిటైర్డు న్యాయమూర్తిచే విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి గురువారం సాయంత్రం అకస్మాత్తుగా ప్రకటించడం గమనార్హం. జయ మరణంలో చోటుచేసుకున్న అనుమానాలను నివృత్తి కోసమేనా లేదా రాజకీయ ప్రయోజనాలకా అనే ప్రశ్నకు సమాధానం కోసం కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
>
మరిన్ని వార్తలు