టి-మెడికల్ అభ్యర్థులకు ఏపీ వెసులుబాటు

30 Jul, 2016 20:41 IST|Sakshi
టి-మెడికల్ అభ్యర్థులకు ఏపీ వెసులుబాటు

హైదరాబాద్: మెడికల్ సీట్ల భర్తీకి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ను తమ విద్యార్థుల కోసం మరోసారి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. లక్ష్మారెడ్డి విన్నపానికి కామినేని శ్రీనివాస్ అంగీకరించారు. ఎంసెట్-2 రద్దు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కామినేనితో లక్ష్మారెడ్డి మాట్లాడాక కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి శనివారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రవిరాజుకు లేఖ రాశారు. అయితే అంగీకారం తెలుపుతూ అక్కడి నుంచి అధికారికంగా సమాచారం రాలేదని తెలిసింది. ఏపీలో మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ 6, 7, 8 తేదీల్లో జరుగనుంది. ఆ లోపు తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాల్సివుంటుంది.

ఇక్కడ వస్తుందనుకుని అక్కడ వదులుకున్నారు..
తెలంగాణ ఎంసెట్-2లో మెడికల్ టాప్ ర్యాంకులు సాధించుకున్న విద్యార్థులు అనేక మంది ఏపీ ఎంసెట్‌లోనూ టాప్ ర్యాంకులు పొందారు. ఏపీ ఎంసెట్ కంటే మెరుగైన ర్యాంకులు వచ్చిన విద్యార్థులు అక్కడి సీట్లను వదులుకోవానలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ రాష్ట్రంలో నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు తెలంగాణ విద్యార్థులు అనేకమంది హాజరుకాలేదు.

దురదష్టవశాత్తు ఏపీలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక ఊహించని రీతిలో ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం బయటపడింది. ఇది విద్యార్థులకు పిడుగుపాటు అయింది. ఏపీలో సీటును వదులుకోవడం.. తెలంగాణలో ఎంసెట్-2 రద్దుతో రెండు చోట్లా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఏపీలో ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ముగియలేదు. కౌన్సిలింగ్‌కు హాజరు కావాలంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తప్పనిసరి. వెరిఫికేషన్‌లో పాల్గొనని కొందరు విద్యార్థులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, వీసీ కరుణాకర్‌ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

15 శాతం సీట్లలో ఓపెన్ కాంపిటీషన్..
ఏపీలో ఉన్న మెడికల్ సీట్ల మొత్తంలో 15 శాతం ఓపెన్ కాంపిటీషన్ లో పొందే వీలుంది. ఆ ప్రకారం తెలంగాణకు చెందిన ఏపీ ఎంసెట్ టాప్ ర్యాంకర్లు కౌన్సిలింగ్ లో సీట్లు పొందొచ్చు. తెలంగాణ ఎంసెట్-2లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అనేకమంది ఏపీ కౌన్సిలింగ్ కు హజరుకాలేదు. దీంతో ఇప్పుడు ఆ సీట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు మాత్రం తమ రాష్ట్ర విద్యార్థుల సీట్లకు కోత పడతాయన్న ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. మానవతా దృక్పథంతో ఆలోచించాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీని కోరుతోంది.

>
మరిన్ని వార్తలు