ఆందోళనలో ఆటోవాలా

27 Apr, 2020 08:12 IST|Sakshi

ఇంటికే పరిమితమైన ఆటోలు

లాక్‌డౌన్‌తో రోడ్డెక్కని దుస్థితి

కుటుంబ పోషణలో ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లు

చుట్టుముడుతున్న ఆర్థిక ఇబ్బందులు

ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి వేడుకోలు  

లాక్‌డౌన్‌తో ఆటో ఇంటికే పరిమితమైంది. దీంతో బతుకు బండిని లాగలేక ఆటో డ్రైవర్లు ఆగమవుతున్నారు. రోజూ ఎంతో కొంత ఆదాయం వస్తే గాని పూటగడవని స్థితిలో కరోనా వచ్చి వారి కుటుంబాలను ఆగం చేసింది. బండి ఫైనాన్స్‌ కట్టాల్సిన సమయంలో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి లేక వారి బతుకు చిత్రం పూర్తిగా మారిపోయింది. డబ్బులు లేక ఏ పని దొరక్క పూట గడవని స్థితికి చేరుకున్నారు. ఈ మహమ్మారి నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో.. ఎప్పుడు ఆటోలు రోడ్డెక్కి బతుకులు బాగుపడతాయోననిఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాలో 2435 ఆటోలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజ రవాణాలో ప్రభుత్వ బస్సుల తరువాత అంతటి స్థానం ఆటోలు అక్రమించాయి. దీంతో పాటుగా పట్టణాలో ఒక చోటు నుంచి మరోచోటుకు ఈ ఆటోల ప్రయాణాలే కీలకంగా ఉంటాయి. దీంతో ఆటోల వినియోగం అధికంగా ఉంటుంది. అనేక మంది నిరుద్యోగ యువత ఈ ఆటో నడుపుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అనేక మంది యువత రోజు వారి పనులు చేసుకుంటూ సాయంత్రం నుంచి ఉదయం వరకు ఆటోలు నడుపుతూ తమ జీవనం సాగిస్తున్నారు. 

పూట పూటకు గండమే..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌తో వీరి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజూ బండి రోడ్కెక్కితే కాని పూట గడవని పరిస్థితిలో ఆటోవాలాలు ఉన్నారు. కరోనాతో ఆటో నడపక వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పాడింది. దీనికి తోడు వారు తీసుకున్న అప్పులతో అనేక మంది ఆటోవాలల బతుకు చిధ్రం అవుతోంది. నిరుద్యోగ యువకుల కడుపు నింపుతున్న ఆటో ప్రస్తుతం కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటోవాలాలు వేడుకుంటున్నారు. 

వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు
ఆటోవాలాలు రోజువారీ ఫైనాన్స్‌ తీసుకొని, ఇతరుల వద్ద వడ్డీలకు రుణం తీసుకొని ఆటోలు ఖరీధు చేస్తారు. వారు రోజు ఆటో నడుపగా వచ్చిన డబ్బుతో రోజువారీ ఫైనాన్స్‌ కట్టి మిగిలిన డబ్బులతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కానీ నెల రోజులుగా ఆటోలు రోడ్లపై తిరుగకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. తాము తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని, ఈ లాక్‌డౌన్‌లో కుటుంబం గడవడమే కష్టంగా మారిందని ఆటోవాలా ఆందోళన చెందుతున్నాడు.  

ఆదుకోవాలి
నేను ప్రతీ రోజు సిద్దిపేట పట్టణంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. కానీ లాక్‌డౌన్‌తో నెల రోజులుగా ఇంటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజూ ఆటో నడిపితేనే కుటుంబం గడుస్తది.. కానీ నేడు కుటుంబాన్ని నడపటం భారంగా మారింది. ప్రభుత్వం మా ఆటోవాలాలను ఆదుకోవాలి.– పల్లె అనిల్‌ గౌడ్, మిట్టపల్లి, ఆటో డ్రైవర్‌

ఇబ్బందులు పడుతున్నాం
ప్రతి రోజూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సమయంలో కరోనా ఆర్థికంగా దెబ్బతీసింది. ఆటో నడిపితేనే నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తాయి. కానీ ఈ లాక్‌డౌన్‌తో పరిస్థితి దయనీయంగా మారింది. డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి.– మల్లేశం, చందాపూర్, ఆటో డ్రైవర్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు