పంట రుణాల లక్ష్యం రూ.1,549 కోట్లు

21 Jun, 2014 23:44 IST|Sakshi
పంట రుణాల లక్ష్యం రూ.1,549 కోట్లు

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,549 కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 50శాతం అధికం.  శనివారం 2014-15 జిల్లా రుణ ప్రణాళికను కలెక్టర్ ఎన్ .శ్రీధర్ విడుదల చేశారు. వివిధ రంగాలకు రూ.5,393.29 కోట్ల రుణ వితరణ చేయాలని నిర్ణయించిన బ్యాంకర్లు.. స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతకు పెద్దపీట వేశారు. మహిళా సంఘాలకు రూ.2,036.39 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు.

రుణాలు త్వరగా ఇవ్వండి
ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకమని, ప్రతి పథకానికి బ్యాంకుతో లింకు ఉన్నందున.. రుణ వితరణ లో బ్యాంకులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ శ్రీధర్ సూచించారు. ఎన్నికల నేపథ్యంలో రుణ ప్రణాళిక విడుదల ఆలస్యమైందని, జూలైలోపు రైతులకు పంట రుణాలు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు చొరవ చూపాలన్నారు.

జనవరిలోపు ప్రభుత్వ పథకాలు గ్రౌండింగ్ చేసేలా సంబంధిత శాఖల అధికారులు చూడాలని, పథకాల గ్రౌండింగ్ ఆలస్యమైతే నిధులు మురిగే ప్రమాదముందని, లబ్ధిదారులకు అన్యా యం జరుగుతుందన్నారు. ఉద్యాన పంటల హబ్‌గా జిల్లాను మార్చాలని నిర్ణయించామని, అందుకనుగుణంగా పూలు, పండ్ల తోటల పెంపకానికి చేయూతనిచ్చేందుకు బ్యాంకులు శ్రద్ధ వహించాలని సూచించా రు. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే నిర్దేశిత లక్ష్యాలను సులువుగా అధిగమించవచ్చని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ ఎంవీ రెడ్డి, ఎస్‌బీహెచ్ జీఎం కేఎస్ జవాండా, డీజీఎం దేవేందర్, నాబార్డు ఏజీఎం సుబ్బారావు, ఎల్‌డీఎం సుబ్రమణ్యం పాల్గొన్నారు. కాగా, లీడ్‌బ్యాంకు అధికారులు రూపొందిం చిన రుణ ప్రణాళికలో గత ఏడాది నిర్దేశిత లక్ష్యంలో ఏ మేరకు సాధించాం.. ఎంతమందికి లబ్ధి చేకూర్చామనే అంశం పొందుపరచకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు