కోవిడ్‌కు హైదరాబాద్‌ ఇంజెక్షన్‌ రెడీ

21 Jun, 2020 13:49 IST|Sakshi

‘కోవిఫర్‌’ పేరుతో రెమ్డిసివిర్‌ మార్కెట్లోకి విడుదల

లక్ష డోసులు సిద్ధం చేసిన హెటిరో సంస్థ

ఇంజెక్షన్‌ రూపంలో ఉన్న యాంటివైరల్‌ ఔషధం

సాక్షి, హైదరాబాద్‌ : మానవాళిని గడగడలాడిస్తోన్న కోవిడ్‌ మహామ్మారికి హైదరాబాదీ మెడిసిన్‌ సిద్ధమైంది. నగరంలోని సుప్రసిద్ధ జెనెరిక్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ హెటిరో సంస్థ కరోనాను కట్టడిచేసే రెమ్డిసివిర్‌ ఔషధాన్ని ‘కోవిఫర్‌’ ఇంజెక్షన్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మేరకు  క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో హెటిరో ఆదివారం కీల‌క ప్రకట‌న చేసింది. కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా ఇన్వెస్టిగేష‌న్ యాంటీ వైరల్ మెడిసిన్ (రెమ్డిసివిర్)` ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోల‌ర్ జన‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి పొందిన‌ట్లు వెల్లడించింది. రెమ్డిసివిర్ హెటిరో జెనిరిక్ వెర్షన్‌కు ‘కోవిఫర్’ అనే పేరుతో భార‌త‌దేశంలో మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ ఇంజెక్షన్లను లక్షడోసుల మేర సిద్ధం చేశామని సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. (కరోనా డ్రగ్‌ అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌) 

ఈ సంద‌ర్భంగా హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ బి.పార్థసార‌థి రెడ్డి మాట్లాడుతూ ‘భార‌త‌దేశంలో కోవిడ్‌-19 కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న త‌రుణంలో `కోవిఫ‌ర్‌` (రెమ్డిసివిర్‌) విజ‌య‌వంత‌మైన క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ పూర్తి చేసుకొని అందుబాటులోకి రావ‌డం గేమ్ చేంజ‌ర్‌గా మార‌నుంది. బ‌ల‌మైన ఇంటిగ్రేష‌న్ సామ‌ర్థ్యాల‌ను క‌లిగి ఉండ‌టం వ‌ల్ల ఈ ఉత్పత్తి దేశ‌వ్యాప్తంగా వెంట‌నే రోగుల‌కు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నెల‌కొన్న అవ‌స‌రాల‌కు త‌గిన రీతిలో రోగుల‌కు త‌గిన‌ట్లుగా ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమ‌వుతోంది. కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా ప్రభుత్వం, వైద్య విభాగాలతో మేం నిరంత‌రం క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ రూపొందించిన‌ `మేక్ ఇన్ ఇండియా` ప్రచారానికి త‌గినట్లుగా భార‌త‌దేశంలో ఈ ఉత్పత్తిని తీర్చిదిద్దాం’ అని ప్రకటించారు.

డీసీజీఐచే అనుమ‌తి పొందిన‌ `రెమ్డిసివిర్‌` ఔష‌ధాన్ని కోవిడ్ అనుమానితులు లేదా ల్యాబ్‌ల‌లో ప‌రీక్ష చేసిన అనంత‌రం పాజిటివ్ రోగులుగా గుర్తించ‌బ‌డిన చిన్నారులు, యువత, కోవిడ్ ల‌క్షణాల‌తో ఆస్పత్రి పాలైన వారి చికిత్స కోసం వినియోగించ‌వ‌చ్చు. కోవిఫ‌ర్ (రెమ్డిసివిర్‌) 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. వైద్యల ప‌ర్యవేక్షణ‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి దీనిని అందించ‌వ‌చ్చు. త‌క్కువ మ‌ధ్య స్థాయి ఆదాయం క‌లిగిన దేశాల్లోని ప్రజల‌కు కోవిడ్‌-19 చికిత్స చేయ‌డంలో భాగంగా గిలిడ్ సైన్సెస్ ఐఎన్‌సీ తో కుదుర్చుకున్న లైసెన్స్ ఒప్పందాన్ని అనుస‌రించి ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువ‌స్తున్నారు.

మరిన్ని వార్తలు