గ్రామసింహాలూ వేట వైపు?

18 Apr, 2020 00:43 IST|Sakshi

లాక్‌డౌన్‌తో తిండి దొరక్క కుక్కల ప్రవర్తనలో మార్పు 

గతంలో కేరళ వరదలప్పుడు కొన్ని ఊళ్లలో ఇదే పరిస్థితి 

ఇతర వన్య ప్రాణులకు ముప్పుగా మారే ప్రమాదం 

యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ అధ్యయనం

కేరళ.. ఓ సంవత్సరన్నర క్రితం వరదలతో పోరాడింది. ఆ సమయంలో వందల ఊళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శునకాలకు తిండిలేక దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రాణాలు నిలుపుకునే క్రమంలో అవి ‘వేట’ఆరంభించాయి. కోళ్లు, పక్షులు, కుందేళ్లు లాంటి వాటిని ఆహారం చేసుకున్నాయి. మన దేశంలో దాదాపు 3.5 కోట్ల శునకాలు ఉంటాయన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. హైదరాబాద్‌లో వాటి సంఖ్య దాదాపు 9 లక్షలు ఉంటుంది. మన రాష్ట్రంలో 25 లక్షలకు పైమాటే.   

సాక్షి, హైదరాబాద్‌: అనుకోకుండా వచ్చి పడ్డ కరోనా సమస్య ఎన్నో మార్పులకు కారణం కాబోతోంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట ఇది. కరోనా విపత్తు నుంచి తేరుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కానీ, ఎన్నడూ చూడని విధంగా ప్రస్తుతం మనం అమలుచేసుకుంటున్న లాక్‌డౌన్‌ కూడా ఎన్నో మార్పులకు కారణమవుతోంది. ఇది మనుషులకే కాదు, జంతువులకూ వర్తించనుంది. ఈ విషయంలో శునకాలు ముందు వరసలో ఉన్నాయంటున్నారు జంతు ప్రేమికులు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువ రోజుల పాటు కుక్కలకు తిండి దొరక్కపోవడంతో అవి క్రమంగా ఇతర జంతువులను వేటాడేందుకు యత్నిస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదని వారు హెచ్చరిస్తున్నారు.

ఒకసారి ఇతర జంతువులను వేటాడి చంపేందుకు అలవాటు పడితే, వెంటనే అవి తీరు మార్చుకోని పక్షంలో వన్య ప్రాణులకు ఇబ్బందులు ఎదురుకాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న లాక్‌డౌన్, మరో పక్షం రోజులు (పొడిగింపు లేకుంటే) జరగాల్సి ఉన్న తరుణంలో కుక్కల తీరులో విపరీత మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ‘యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ’పేర్కొంటోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుక్కల ప్రవర్తనలో మార్పులపై కొద్ది రోజులుగా ఆ సంస్థ ప్రతినిధులు అధ్యయనం చేస్తున్నారు. పూర్తి జనావాసాల్లో ఉండే కుక్కల కంటే, చుట్టూ ఇళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లోని శునకాల్లో ప్రవర్తనలో మార్పు వస్తోందని చెబుతున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ క్యాంపస్, సంజీవయ్య పార్కు, హయత్‌నగర్‌ వైపు ఉన్న శివారు ప్రాంతాల్లో వారు అధ్యయనం చేశారు.  

పక్షులు, చిన్న జంతువులపై దాడులు.. 
ఇళ్లలో పెంచుకునే కుక్కలకు నిత్యం సమయానుకూలంగా తిండి లభిస్తుంది. కానీ వీధుల్లో సంచరించే శునకాలు మనుషులు పడేసే పదార్థాల నుంచి ఆహారాన్ని సేకరించుకుంటాయి. హోటళ్ల సమీపంలోని చెత్తకుండీలు, కాలనీలు, బస్తీల్లోని డంపింగ్‌ స్థలాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో పడేసిన ఆహారాన్ని అవి తింటాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాటికి ఆ తిండి బాగా కరువైంది. పార్కులు, రైల్వేస్టేషన్, బస్టాండ్‌ పరిసరాల్లో అయితే అక్కడికి వచ్చే సందర్శకులు, ప్రయాణికులు పడేసే వాటినే అవి తింటుంటాయి. ఇప్పుడు జనం ఇళ్లకే పరిమితం కావటంతో అలాంటి ప్రాంతాల్లో వాటికి తిండి లేకుండా పోయింది. దీంతో చాలా ప్రాంతాల్లో అవి తీవ్ర ఆకలితో నకనకలాడుతున్నాయి. ఫలితంగా కంటికి కనిపించిన ఇతర చిన్న జంతువులు, పక్షులను వేటాడే ప్రయత్నం చేస్తున్నాయి.  

వన్య ప్రాణులకు ప్రమాదం.. 
కుక్కలు ఒకసారి ఇతర పక్షులను వేటాడేందుకు అలవాటుపడితే ప్రమాదం అంటున్నారు యానిమల్‌ వారియర్స్‌ సంస్థ వ్యవస్థాపకులు ప్రదీప్‌ నాయర్‌. ‘లాక్‌డౌన్‌ పరిధి ఎక్కువగా ఉంటే కుక్కలు ఆకలి తీర్చుకునేందుకు ఇతర జంతువులు, పక్షులను వేటాడే పరిస్థితి ఉంటుంది. వాటిలో వచ్చే విపరీత ప్రవర్తనలతో ఒక్కోసారి మనుషులపై దాడి చేసే పరిస్థితి వస్తే ఆ పరిణామం తిరిగి కుక్కలకే శాపంగా మారుతుంది. తమపై దాడి చేస్తే జనం ఆ కుక్కలను చంపేందుకు కూడా వెనకాడరు. ఒకచోట దాడి చేస్తే, చాలాచోట్ల ఊరకుక్కలను బతకనీయరు’ అని పేర్కొన్నారు.  

కొత్త రోగాలకు అవకాశం: ‘వేటలో భాగంగా కుక్కలు ఇతర జంతువులను వేటాడి తింటే వాటి ద్వారా కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ కుక్కల ద్వారా వన్యప్రాణులకు కొత్త రోగాలు సంక్రమించే ప్రమాదం ఉంది’ అని ఆ సంస్థ మరో ప్రతినిధి సంజీవ్‌ వర్మ అంటున్నారు. అందుకే ఇలాంటి దుస్థితి రాకుండా గ్రామసింహాలకు ప్రజలు ఆహారాన్ని అందించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు