ఒక్కరోజు ‘కరోనా’ బిల్లు రూ. 1,50,000

6 Jul, 2020 02:01 IST|Sakshi

ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం.. ఇదేమని అడిగితే నిర్బంధం

ఫీవర్‌ ఆస్పత్రి డాక్టర్‌కు చేదు అనుభవం.. 

సెల్ఫీ వీడియోతో వెలుగులోకి..

వైద్య శాఖ మంత్రి కార్యాలయం జోక్యంతో వైద్యురాలి డిశ్చార్జి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగులపై ప్రైవేటు ఆస్ప త్రులు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. అసలు మందే లేని కరోనాకు చికిత్స పేరుతో లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. చెల్లించలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్న బాధితులను ఆస్పత్రుల్లో నిర్బంధిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలను పక్కనపెట్టి ఇష్టానుసారం బిల్లులు వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. మలక్‌పేటలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి కరోనా బాధితునికి పీపీఈ కిట్ల చార్జీలను రూ.45 వేలకు పైగా వేసిన విషయం మర్చిపోక ముందే చాదర్‌ఘాట్‌లోని మరో కార్పొరేట్‌ బిల్లు కోసం ఏకంగా ప్రభుత్వ వైద్యురాలినే నిర్బంధించింది. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి)

అసలేమైందంటే..: మలక్‌పేటకు చెందిన డాక్టర్‌ హర్ష సుల్తానా నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌. వారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఐదు రోజల క్రితం ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. మరోసారి చేయించుకోగా కరోనా నిర్ధారణైంది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు కుమారులకూ పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

జూలై 1న అర్ధరాత్రి శ్వాస సంబంధ సమస్య తలెత్తడంలో ఇంట్లో ఉండటం శ్రేయస్కరం కాదని భావించిన సుల్తానా.. సమీపంలోని చాదర్‌ఘాట్‌ తుంబే ఆస్పత్రిలో చేరారు. అడ్మిషన్‌కు ముందే రూ.40 వేలు చెల్లించారు. ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే రూ.1.50 లక్షల బిల్లు చేతికొచ్చింది. ఒక్కరోజుకే ఇంత బిల్లు ఎలా వేస్తారని ఆమె ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. బిల్లు చెల్లించేందుకు నిరాకరిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించగా, సిబ్బంది అడ్డుకుని నిర్బంధించారు. (చచ్చినా వదలట్లేదు)

దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి బయటికి వదిలారు. ఓ ప్రభుత్వ వైద్యురాలు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీసిన ఈ వీడియోను ఆమె బంధువులు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సహా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, పోలీసు ఉన్నతాధికారుల ట్విట్టర్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేశారు. చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆస్పత్రిపై ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికొచ్చింది. సదరు వీడియో వైరల్‌ కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సదరు కార్యాలయం నుంచి ఫోన్‌ చేయడంతో సుల్తానాను తుంబే ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జ్‌ చేసింది. విచ్చలవిడిగా బిల్లులు వేస్తూ పేషంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్న తుంబే హాస్పిటల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ సుల్తానా కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. (ఒక్క రోజే 1,590 కేసులు)

దురుసుగా ప్రవర్తించారు
కరోనాతో బాధపడుతున్న డాక్టర్‌ సుల్తానాకు వైద్యపరంగా అన్ని సేవలూ అందించాం. అధిక బిల్లు వేశామనే ఆరోపణల్లో నిజం లేదు. ఆమె ఐదు రోజుల క్రితం చేరారు. సిబ్బందితో ఆమె దురుసుగా ప్రవర్తించారు. స్టాఫ్‌నర్సులను అసభ్య పదజాలంతో దూషించారు. ఆమె వద్దకు వెళ్లేందుకు సిబ్బంది భయపడేవారు. ఆమెకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్‌ ఇస్తూనే ఉన్నాం. పూర్తిగా కోలుకోవడంతోనే డిశ్చార్జి చేశాం. – తుంబే ఆస్పత్రి యాజమాన్యం

ముందే చెబితే నిమ్స్‌లో చేర్చేవాళ్లం
డాక్టర్‌ సుల్తానాకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం ఆమె చెప్పే వరకు తెలియదు. క్వారంటైన్‌కు వెళ్తానని చెప్పడంతో అనుమతిచ్చాం. ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం లేదు. ముందే చెబితే ఫీవర్‌లో లేదా నిమ్స్‌లో చేర్చి వైద్యం చేయించేవాళ్లం. ఫీవర్‌ ఆస్పత్రి వైద్యురాలిగా ఆమె ఆరోగ్యాన్ని కాపాడటం మా బాధ్యత. విషయం తెలిసిన వెంటనే ఆర్‌ఎంఓ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. – డాక్టర్‌ శంకర్, ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

మరిన్ని వార్తలు