అరెరే.. ఇదెలా?

14 Apr, 2020 06:49 IST|Sakshi

నగరంలో గడప దాటని ఇద్దరికి కరోనా పాజిటివ్‌

పక్షవాతంతో ఇంట్లో ఉన్న గాంధీనగర్‌ వాసిసహా టోలిచౌలికి చెందిన బాలిక

ట్రేస్‌కానీ కాంటాక్ట్‌ హిస్టరీ.. తలపట్టుకుంటున్న సర్వేలెన్స్‌ ఆఫీసర్లు

లక్షణాలు లేని వారి నుంచి కూడా కరోనా వైరస్‌

బయటికి వెళ్లినా.. ఇంట్లో ఉన్నా మాస్క్‌లు తప్పనిసరి

సాక్షి, సిటీబ్యూరో: గాంధీ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి(48) పక్షవాతంతో బాధపడుతున్నాడు. కాళ్లు, చేతులు పని చేయడం లేదు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విదేశాలకు కానీ, ఇతర ప్రాంతాలకు కానీ వెళ్లి వచ్చిన నేపథ్యం లేదు. దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించగా, కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. దీంతో కుటంబ సభ్యులే కాదు చికిత్స చేసిన వైద్యులు కూడా షాక్‌కు గురి కావాల్సి వచ్చింది. ఇక టోలిచౌకికి చెందిన బాలిక(8) ఉన్నట్టుండి దగ్గు, జలుబు, జ్వరం బారిన పడింది. చికిత్స కోసం తల్లిదండ్రులు బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులకు అనుమానం వచ్చి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిజానికి ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం ఆమెకు కానీ, ఆమె తల్లి దండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు లేదు. ఎలాంటి కాంటాక్ట్‌ హిస్టరీ లేకపోయినా బాలికకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులతో పాటు కాంటాక్ట్‌ హిస్టరీ ట్రేస్‌ చేసేందుకు వెళ్లిన సర్వె లెన్స్‌ ఆఫీసర్లకు అంతుచిక్కడం లేదు. బాధితులకు వైరస్‌ ఎలా సోకిందో తెలియక వారి కుటుంబ సభ్యులతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తలపట్టుకుంటున్నారు. (కరోనా కాపాడింది!)

వారు వెళ్లిన దారిలో ప్రయాణించినా...
ఇప్పటి వరకు విదేశాల నుంచి, మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాపిస్తున్నట్లు భావించాం. నిజానికి ఎలాంటి ట్రావెలింగ్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ హిస్టరీ లేని వాళ్లకు కూడా వైరస్‌ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొంత మందిలో వైరస్‌ లక్షణాలు స్పష్టంగా కన్పిస్తుంటే.. మరికొంత మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదు. లక్షణాలు లేకపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారుతోంది. వీరిలో ఎవరైనా రోడ్డుపై ప్రయాణించే సమయంలో తుమ్మడం, దగ్గడం, ఉమ్మడం వంటివి చేస్తుంటారు. ఇలా తుంపర్ల ద్వారా బయటి వచ్చిన వైరస్‌ గాలిలో మూడు మీటర్ల పరిధిలో విస్తరించి, మూడు గంటల పాటు జీవిస్తుంది. ఆ తర్వాత కింద పడిపోతుంది. ఈ సమయంలో అదే దారిలో ప్రయాణించిన వ్యక్తులకు వైరస్‌ వ్యాపిస్తుందని వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. గాంధీనగర్, టోలిచౌకి బాధితులకు ఇలాగే వైరస్‌ విస్తరించినట్లు వైద్యులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇప్పటి వరకు తుమ్మినప్పుడు, దగ్గిప్పుడు మాత్రమే ముక్కుకు, నోటికి మాస్క్‌లను అడ్డుపెట్టుకోవాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బయటికి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్న సమయంలోనూ విధిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేయడం వెనుక ఉన్న ఆంత్యరం ఇదేనని స్పష్టమవుతోంది. ఎవరిలో వైరస్‌ ఉందో గుర్తించడం కష్టమవుతుండటంతో కేవలం బయటికి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్‌లు ధరించాల్సిందేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  (‘లూడో కలిపింది అందరినీ’)

ఇక సరిహద్దు రాష్ట్రాలతోనే ఇక అసలు సమస్యః విదేశాల నుంచి వచ్చిన వారిలో 30 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాయి. వీరి ద్వారా మరో 20 మంది కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకినట్లు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారికి సన్నిహితంగా ఉన్న వారందరినీ కార్వంటైన్‌ చేశారు. ఇప్పటికే వారి క్వారంటైన్‌ టైమ్‌ ముగిసిపోయింది. ప్రస్తుతం వారంతా తమ కుటుంబ సభ్యుల మధ్య సాధారణ పౌరుల్లా గడుపుతున్నారు. ఇక తెలంగాణ నుంచి మర్కజ్‌కు సుమారు 1200 మంది వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే 603 మంది ఉన్నారు. వీరిలో 593 మంది సహా వారికి సన్నిహితంగా మెలిగిన మరో 3,500 మందిని గుర్తించారు. వీరిలో 172 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరి ద్వారా మరో వంద మందికిపైగా కుటుంబ సభ్యులకు వైరస్‌ విస్తరించి ఉంది. ప్రస్తుతం 1600 మంది మాత్రమే క్వారంటైన్‌లో ఉన్నారు. వీరి క్వారంటైన్‌ టైమ్‌ కూడా మరో వారం రోజుల్లో ముగియనుంది. ఇకపై కేసుల సంఖ్య దాదాపు తగ్గిపోతుందని ప్రభుత్వం భావించింది. కానీ ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా కేసులు నమోదవుతుండటంతో సిటిజన్లు భయ పడుతున్నారు. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మా రింది. 

కన్పించని ర్యాపిడ్‌ టెస్టులుః కార్వంటైన్‌లో ఉన్న వారి నుంచి కాకుండా ట్రావెల్, మర్కజ్‌ హిస్టరీ లేనివారిలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండటం, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌తో సంబంధం లేకుండా కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించింది. మూడు కిలో మీటర్ల పరిధి వరకు రాకపోకలపై ఆంక్షలు విధించింది. నియంత్రణ ఇబ్బందిగా మారడంతో వీటి పరిధిని మరింత కుదించింది. 12 కంటైన్మెంట్‌ క్లస్టర్లను కాస్తా 123 జోన్లుగా విభజించింది. ఒక్కో జోన్‌లో 10 నుంచి 50 నివాసాలు ఉండే విధంగా చూసింది. కాలనీ వాసులను బయటికి రాకుండా, ఇతరులు లోనికి వెళ్లకుండా పూర్తిగా నిషేధించింది. ఆయా కాలనీల్లో హోం క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల కదలికలను జియోటా గింగ్‌ ద్వారా ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్‌ టెస్టులు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ గ్రేటర్‌లో ఏ జోన్‌లో కూడా ఇప్పటి వరకు ర్యాపిడ్‌ టెస్టులు చేసిన పాపాన పోలేదు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులు కనీసం కేసుల ట్రేసింగ్‌ కూడా వెళ్లడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ఎవరైనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం ఇస్తే తప్ప.. తమ వద్దకు ఎవరూ రావడం లేదని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. 

16 మంది మృతుల్లో గ్రేటర్‌ వాసులే 12 మంది
సోమవారం ఉదయం నాటికి తెలంగాణలో 531 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో చికిత్సల తర్వాత కోలుకుని మరో 103 మంది ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం 412 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీటిలో ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ జిల్లాలో 220పైగా కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 45, మేడ్చల్‌లో 25 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 16 మంది చనిపోతే.. వీరిలో ఈ మూడు జిల్లాలకు చెందిన వారే 12 మంది ఉండటం గమనార్హం. శుక్రవారం సికింద్రాబాద్‌ ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి నుంచి చివరి నిమిషంలో గాంధీకి వచ్చిన ఓ మహిళ చనిపోతే.. శనివారం ఇద్దరు చనిపోయారు. ఆదివారం మరో ఇద్దరు చనిపోయారు. తాజాగా సోమవారం కింగ్‌కోఠి ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న డబీర్‌పురాకు చెందిన మరో వ్యక్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. 

మరిన్ని వార్తలు