నేటి నుంచి కరోనా పరీక్షలు

30 Jun, 2020 05:49 IST|Sakshi

లక్షణాలు ఉంటేనే చేయించుకోవాలి

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 50 వేల మందికి కరోనా పరీక్షలు చేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 16వ తేదీ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ ఎత్తున కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్దేశించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 వేల శాంపిళ్లను తీసుకున్నారు. అందులో దాదాపు 27 వేలకు పైగా నమూనాలను పరిశీలించి ఫలితాలు ప్రకటించారు.

మిగిలినవి పెండింగ్‌లో పడ్డాయి. ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించే రోజువారీ సామర్థ్యం ఆ మేరకు లేకపోవడంతో తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. పెండింగ్‌పరీక్షలను పూర్తి చేయడంతో తిరిగి చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు.  కొండాపూర్, బాలాపూర్, వనస్థలిపురం, గోల్కొండ, అంబర్‌పేట, రామంతపూర్‌లోని హోమియో ఆసుపత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్, సరోజినీ ఆసుపత్రి తదితర నిర్దేశించినచోట్ల కరోనా శాంపిళ్లను స్వీకరిస్తారు. హైదరాబాద్‌ పరిధిలోని 30 నియోజకవర్గాల్లో ఇది కొనసాగనుంది. ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పుల తడకగా ఉన్నాయంటూ ప్రభుత్వం స్పష్టం చేయడంతో వాటిపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. లక్షణాలున్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని వైద్యారోగ్యశాఖ తెలిపింది.    

మరిన్ని వార్తలు