కరోనా: తెలంగాణలో మరో 33 మందికి

11 May, 2020 03:45 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 26 కేసులు 

మరో ఏడుగురు వలస కార్మికులు 

రాష్ట్రంలో 1,196కి చేరుకున్న పాజిటివ్‌ కేసులు 

యాదాద్రి జిల్లాలో నలుగురు వలస కార్మికులకు వైరస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఆదివారం మరో 33 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 నమోదుకాగా, మిగిలిన 7 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారివి. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసులు 1,196కు చేరుకున్నాయి. తాజాగా ఎవరూ డిశ్చార్జి కాలేదు. ఇప్ప టివరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా, 751 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 415 మంది చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. తాజా లెక్కలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 11 మందికి వలస వ్యక్తులకు కరోనా సోకినట్లయింది. వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణకు చెందినవారు. అలా వచ్చిన పాజిటివ్‌ కేసులన్నింటినీ వలసల కిందనే లెక్కిస్తున్నారు. వారు ఏ జిల్లా వారో ఆ జిల్లాల కరోనా కేసుల జాబితాలో చూపడం లేదు.  
(చదవండి: సాహో.. ఆరోగ్య సేతు..!)

14 రోజులుగా 24 జిల్లాల్లో కేసుల్లేవ్‌...
గత 14 రోజులుగా అసలే కేసులు నమోదు కాని జిల్లాలు 24 ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్లగొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్‌ అర్బన్, నిర్మల్‌ జిల్లాలు అందులో ఉన్నాయి.
(చదవండి: బర్త్‌డేలో సూపర్‌ స్ప్రెడ్‌!)

మరిన్ని వార్తలు