కరోనా: 7నుంచి నిమ్స్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌

4 Jul, 2020 17:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  జూలై 7వ తేదీ నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫేస్ 1, ఫేస్ 2 కింద ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతాయన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌కు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. మొదటి ఫేస్‌ 28 రోజులు ఉంటుందని, వ్యాక్సిన్‌ ఇచ్చాక  రెండు రోజులు ఆస్పత్రిలో అడ్మిట్‌ చేస్తామని మనోహర్‌ పేర్కొన్నారు. (చదవండి : ఆగస్టు 15 నాటికి కరోనా టీకా!)

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ అంతు చూసే వ్యాక్సిన్‌ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) భావిస్తోంది. వ్యాక్సిన్‌ అభివృద్ధి విషయంలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్, పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీతో(ఎన్‌ఐవీ) కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నిర్మూలనకు భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ను దేశంలో 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్‌ నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు