కోవిడ్‌ కిట్‌.. హోం డెలివరీ

14 Jul, 2020 07:02 IST|Sakshi

హోం ఐసోలేషన్‌ బాధితులకు అందజేత  

17 రోజులకు  సరిపడే మందులు, గ్లవ్స్, శానిటైజర్, ఇతరత్రా సామగ్రి  

గ్రేటర్‌ పరిధిలో సుమారు 15వేల కిట్ల పంపిణీ  

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌– 19  పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ కరోనా వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి ఇంట్లోనే హోం ఐసోలేషన్‌గా ఉంటూ చికిత్స పొందుతున్న వారి కోసం ఇళ్లకే ‘హోం ఐసోలేషన్‌ కిట్‌’ పంపిణీ చేస్తున్నారు.  క్షేత్రస్థాయిలో మెడికల్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది ద్వారా పాజిటివ్‌ వ్యక్తులున్న ఇళ్లకు వీటిని అందజేస్తున్నారు. గతంలో సమీపంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు వెళ్లిన హోం ఐసోలేషన్‌లోని వారికి వీటిని అందజేశారు. దాదాపు పది రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా నేరుగా బాధితుల ఇళ్లకే వీటిని పంపిణీ చేస్తున్నారు. 

ఇప్పటి వరకు 20వేల కిట్స్‌ తెప్పించిన జీహెచ్‌ఎంసీవాటిల్లో 15 వేలు పంపిణీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఐదువేలు అందుబాటులో ఉండగా, పాజిటివ్‌ కేసుల సంఖ్యను బట్టి కిట్లను తెప్పించి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 17 రోజులు హోం ఐసొలేషన్‌లో ఉండాలని, అందుకనుగుణంగా అన్ని రోజులకు సరిపడేలా.. త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడే వస్తువులు, టాబ్లెట్లు ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారుకిట్‌ బ్యాగ్‌పై  ఉన్న  క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌– 19 నియంత్రణకు జారీ చేసిన సలహాలు, సూచనలు  తెలుస్తాయని పేర్కొన్నప్పటికీ, స్కాన్‌ చేసిన కొందరు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ లింక్‌ వస్తోందని తెలిపారు.

కాల్‌సెంటర్‌ ద్వారా ఫీడ్‌బ్యాక్‌..
హోం ఐసోలేషన్‌ కిట్స్‌ పంపిణీ జరిగిన వారికి కోవిడ్‌– 19 కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఫోన్‌ చేసి, బాధితుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. కిట్‌ బాగుందని,  కోలుకుంటున్నామని వారి నుంచి సమాధానాలొస్తున్నట్లు పేర్కొంది.  

కిట్‌లో ఏమున్నాయి?
విటమిన్‌– సి టాబ్లెట్స్‌: 34
జింక్‌ టాబ్లెట్లు : 17
బీ కాంప్లెక్స్‌ టాబ్లెట్లు: 17
క్లాత్‌ మాస్కులు :6
శానిటైజర్‌ బాటిల్‌ : 1
లిక్విడ్‌ హ్యాండ్‌వాష్‌ : 1
చేతి గ్లవ్స్‌ :2 జతలు
సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం బాటిల్‌: 1
హోమ్‌ ఐసోలేషన్‌లో పాటించాల్సిన నిబంధనల బ్రోచర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు