మహిళల పేరిటే పట్టాలు

27 Jul, 2014 03:23 IST|Sakshi
మహిళల పేరిటే పట్టాలు

దళితులకు భూపంపిణీపై జీవో జారీ
అత్యంత నిరుపేదలకు తొలి విడత భూమి
మార్గదర్శకాలపై త్వరలో ఉత్తర్వులు!    
సాక్షి, హైదరాబాద్: భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ భూమికి మహిళల పేరిటే పట్టాలను ఇవ్వనుంది. అలాగే ఏడాదిపాటు సాగుకు అవసరమైన ప్యాకేజీని కూడా అందించనుంది. ఈ మేరకు శనివారం ఎస్సీ అభివృద్ధిశాఖ జీవో జారీ చేసింది. దళితులు గౌరవంగా బతికే అవకాశం కల్పించేందుకు.. భూమిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భూమి కొనుగోలు, పంపిణీ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం.. వ్యవసాయాధారిత దళిత కుటుంబాల అభివృద్ధికి గతంలో ఉన్న విధానాల్లో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం 2014-15లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద దళిత నిరుపేదలకు భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తారు.

ఇందులో అసలే భూమిలేని దళిత కుటుంబాలకు మొదటి విడతలో ప్రాధాన్యం ఇస్తారు. అర ఎకరం, ఎకరం భూమి ఉన్న పేద దళిత రైతులకు మిగతా భూమిని అందించి, మూడెకరాల రైతులుగా మార్చడాన్ని రెండో విడతలో చేపడతారు. మూడెకరాలు ఒకే చోట అందిస్తారు. ఇప్పటికే దళిత కుటుంబాలకు అసైన్ చేసిన భూములకు కూడా ఈ కార్యక్రమాన్ని వర్తింపచేస్తారు. రికార్డుల ఆధారంగా భూమిలేని దళితులెవరో..? జిల్లా కలెక్టర్లు గుర్తిస్తారు. భూముల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వంటి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది.

భూమి అభివృద్ధికి, నర్సరీలకు, వ్యవసాయ పరికరాలకు సహాయాన్ని అందించడంతో పాటు ఒక పంట కాలానికి అవసరమైన నీటి వసతి, డ్రిప్ సౌకర్యం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, పంపుసెట్లు, విద్యుదీకరణ తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుంది. వ్యవసాయ వ్యయానికి సంబంధించిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారు ఖాతాకే జమ చేస్తారు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడిగా జారీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు