వైద్యుల రక్షణకు ఎస్పీఎఫ్‌!

12 Jun, 2020 03:32 IST|Sakshi
గురువారం గాంధీ ఆస్పత్రి వద్ద జూడాల ధర్నా

జూడాలకు మంత్రి ఈటల హామీ

రెండోరోజూ కొనసాగిన చర్చలు

సాక్షి, హైదరాబాద్ ‌: వైద్యులపై దాడులను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఇలాంటి ఘటనలు పున రావృతం కాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని భావిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులు, వారి బంధువులు వైద్యులపై దాడి చేయ డంతో జూనియర్‌ డాక్టర్లు ఆందోళనకు దిగిన సం గతి తెలిసిందే. బుధవారం గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జూని యర్‌ డాక్టర్లతో భేటీ అయి దాదాపు నాలుగు గంటల పాటు చర్చించినా ఫలితం తేలలేదు. 

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జూడాల ప్రతినిధుల బృందంతో ఆయన సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలతో పాటు డిమాండ్లను  సాను కూలంగా విన్నారు. వైద్యులపై దాడులు పరిపాటిగా మారడంతో భద్రత కట్టుదిట్టం చేయాలనే డిమాండ్‌ ప్రధానంగా వినిపించింది. దీనిపై ఈటల స్పందిస్తూ.. డాక్టర్ల రక్షణకు ప్రత్యేక పోలీస్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌)ను అందుబాటులో ఉంచుతామని వివరించినట్లు తెలిసింది. అలాగే గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల తాకిడి తీవ్రమైనందున ఇతర ఆస్పత్రుల్లో కూడా కరోనా చికిత్సలకు అనుమతివ్వాలని కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీపై తక్షణ చర్యలు చేపట్టి నియామకాలు పూర్తిచేయాలని డిమాండ్‌ చేయగా.. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. జూనియర్‌ డాక్టర్లతో ప్రతి వారం చర్చలు జరపనున్నట్లు ఈటల మరోమారు స్పష్టం చేసినట్లు జూడాలు వెల్లడించారు. అయితే చర్చలకు సంబంధించి రాత్రి పొద్దుపోయే వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

మూడో రోజుకు చేరిన ఆందోళన
గాంధీఆస్పత్రి: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి జూడాలు విధులు బహిష్కరించి చేపట్టిన ఆందోళన గురువారం మూడో రోజు కూడా కొనసాగింది. ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించిన జూడాలు ఫ్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. దీంతో కరోనా బాధితులకు అందే వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. జూడాల సమ్మె నేపథ్యంలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి పాలనా యంత్రాంగం తెలిపింది. క్వారంటైన్‌లో ఉన్న వైద్యులు, సిబ్బందిని తక్షణమే విధులకు హజరుకావాలని ఆదేశించినట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు