మనదగ్గరే.. ‘మహాతలవర’ సామంత పాలన!

7 Apr, 2016 03:59 IST|Sakshi
మనదగ్గరే.. ‘మహాతలవర’ సామంత పాలన!

♦ లభించిన చారిత్రక ఆధారాలు..
♦ నల్లగొండ జిల్లా పజ్జూరు
♦ పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన నాటి నాణేలు    
 
  సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో ‘మహాతలవర’ సామంత రాజుల పాలనకు సంబంధించిన చారిత్రక ఆధారాలు లభించాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని పజ్జూరు - ఎర్రగడ్డల గూడెం గ్రామాల సరిహద్దులోని పాటి మీద పురావస్తుశాఖ ఆధ్వర్యంలో జరుపుతున్న తవ్వకాల్లో ఈ చారిత్రక ఆధారాలు లభించాయి. తొలియుగ చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్న కారణంతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా  అనుమతి మేరకు గత 50 రోజులుగా ఇక్కడ పురావస్తుశాఖ తవ్వకాలు జరుపుతోంది. 

తవ్వకాల్లో ఇప్పటికే గృహ సముదాయం బయల్పడగా, తాజాగా మహాతలవర సామంతుల పాలనను నిర్ధారించే నాణేలు బయటకు వచ్చాయి. తవ్వకాల్లో భాగంగా బుధవారం ఓ సీసం, ఓ రాగి నాణేలు బయటపడ్డాయని, ఇవి మహాతల వర కాలం నాటివని పురావస్తు అధికారులు చెపుతున్నారు.  మట్టిపూసలు, మహిళలు తిలకం దిద్దుకునేందుకు  సాధనం కూడా లభ్యమయ్యాయి.  క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు తెలంగాణను శాతవాహనులు, ఇక్ష్వాకులు పాలిం చారు. వీరికి సామంతులుగా మహాతలవరులు పనిచేసేవారు. ‘మహాతల’ అంటే పెద్దవాడు అని, ‘వర’ అంటే వరించినవాడు లేదా పొందినవాడు అని అర్థమన్నది  అధికారుల భావన.

>
మరిన్ని వార్తలు