నిమ్స్‌లో భయం భయం: వైద్య సిబ్బందికి కరోనా

4 Jun, 2020 02:33 IST|Sakshi

నలుగురు రెసిడెంట్‌ డాక్టర్లు, ముగ్గురు టెక్నీషియన్లకు పాజిటివ్‌

నిమ్స్‌ కార్డియాలజీ విభాగం ఖాళీ

ఉస్మానియాలో  23 మందికి పాజిటివ్‌

మరో 2 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ముగ్గురు వైద్యులకు కరోనా 

సాక్షి, హైదరాబాద్ ‌: నిమ్స్‌ ఆస్పత్రి కరోనా భయంతో వణికిపోతోంది. ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి చెందిన నలుగురు రెసిడెంట్‌ వైద్యులు, ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లకు తాజాగా కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో వారిని ఆస్పత్రి మిలీనియం బ్లాక్‌లోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఓ రోగికి స్టెంట్‌ వేసే క్రమం లో వీరికి వైరస్‌ సోకినట్లు తెలిసింది. కార్డియాలజీ విభాగంలో 10 మంది రోగులు ఉండగా, వీరిలో ఇద్దరిని మినహా మిగిలిన వారందరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. వైద్యులకు కరోనా సోకడంతో వారితో కలసి హాస్టల్‌ మెస్‌లో భోజనం చేసిన వారు.. గదిలో కలసి ఉన్న వారు.. కలసి చదువుకున్న వైద్యుల్లో ఆందోళన నెలకొంది. అంతేకాదు వీరితో చికిత్సలు చేయించుకున్న రోగులు సైతం భయంతో వణికిపోతున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ స్టాఫ్‌ నర్సు సహా మరో ల్యాబ్‌ టెక్నీషియన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే.

ఆస్పత్రులపై కరోనా దాడి..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులను కరోనా వైరస్‌ ముప్పుతిప్పలు పెడుతోంది. వివిధ రుగ్మతలతో బాధపడుతూ అత్యవసర చికిత్సల కోసం ఆస్పత్రికి వస్తున్న రోగుల్లో ఎవరికి వైరస్‌ ఉందో.. ఎవరికి లేదో.. గుర్తించడం కష్టంగా మారింది. ఓపీ, ఐపీ రోగులను ముట్టుకోకుండానే వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. కానీ ఆపరేషన్‌ థియేటర్‌లో రోగిని ముట్టుకోకుండా సర్జరీ చేయలేని పరిస్థితి. సర్జరీల్లో పాల్గొంటున్న వైద్య సిబ్బందికి రోగుల నుంచి వైరస్‌ సోకుతోంది. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి సహా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చెందిన ఒక ప్రొఫెసర్‌ సహా 23 మంది పీజీలు ఇప్పటికే వైరస్‌ బారిన పడ్డారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు