15 రోజుల్లోగా ప్రతిపాదనలివ్వండి

21 Apr, 2018 02:25 IST|Sakshi

కంటోన్మెంట్‌ ఏరియాలో ప్రత్యామ్నాయ మార్గాలపై సీఎస్‌ ఎస్‌కే జోషి

సాక్షి, హైదరాబాద్‌: ఏవోసీ కంటోన్మెంట్‌ ఏరియాలో గఫ్‌ రోడ్‌కు ప్రత్యామ్నాయంగా రోడ్లు, ఫ్లైఓవర్‌ తదితర నిర్మాణాలకు 15 రోజుల్లోగా అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలు తయారు చేయాలని సివిల్, డిఫెన్స్‌ అధికారుల కమిటీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. గఫ్‌ రోడ్, ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్, మిలిటరీ భూసమస్యలపై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఐవోసీకి సంబంధించి ఆర్‌ అండ్‌ బీ ఎన్‌సీ రవీందర్‌రావు, జీహెచ్‌ఎంసీ సీఈ శ్రీధర్, కమెండింగ్‌ వర్క్స్‌ ఇంజనీర్‌ ఈశ్వర్‌దత్‌లతో కూడిన కమిటీ ప్రజలకు, మిలిటరీకి ఉపయోగపడేలా అలైన్‌మెంట్లు తయారు చేయాలని ఆదేశించారు. జవహర్‌ నగర్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ కు సంబంధించి మేడ్చల్‌ జిల్లా జేసీ, డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆఫీసర్, హెచ్‌ఎండీఏ సీజీఎం ఆనంద్‌ మోహన్‌ తదితరులతో కూడిన కమిటీ ఓ.ఆర్‌.ఆర్‌ గైడ్‌ లైన్స్, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొని లే అవుట్‌ను రూపొందించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో మిలిటరీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఇటువంటి సమావేశం నిర్వహించడం అభినందనీయమని సీఎస్‌ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రా సబ్‌ ఏరియా, జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ మేజర్‌ జనరల్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ..గఫ్‌ రోడ్డును సాధారణ ప్రజలు ఉపయోగించడం వలన భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని, ఇప్పటికే పలుమార్లు మూసివేత గడువును పొడిగించామని, ఈ సమావేశం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్, ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ యం వీ రెడ్డి, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ భారతి హొల్లికేరి, కంటోన్మెంట్‌ బోర్డ్‌ సీఈవో యస్‌.వి.ఆర్‌ చంద్రశేఖర్, బ్రిగేడియర్‌ యం.డి ఉపాధ్యాయ్, బ్రిగేడియర్‌ ప్రమోద్‌ కుమార్‌ శర్మలతో పాటు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు