ఎట్‌ హోమ్‌లో.. ఇద్దరు చంద్రులు

16 Aug, 2017 01:23 IST|Sakshi
ఎట్‌ హోమ్‌లో.. ఇద్దరు చంద్రులు

ఎట్‌ హోమ్‌లో.. ఇద్దరు చంద్రులు
► గవర్నర్‌ సమక్షంలో గంటన్నరకు పైగా భేటీ
► విభజన అంశాలు, సమస్యలపై చర్చ!
► తొలిసారి రాజ్‌భవన్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌
► హాజరైన ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు  


సాక్షి, హైదరాబాద్‌ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో తేనీటి విందు(ఎట్‌ హోమ్‌) ఇచ్చారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం ఎన్‌.చంద్రబాబు నాయుడులతోపాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ విందుకు హాజరయ్యారు. ఆహూతులందరికీ గవర్నర్‌ దంపతులు స్వయంగా స్వాగతం పలికారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఆరున్నర వరకు ఉల్లాసంగా ఎట్‌హోం కార్యక్రమం జరిగింది. అనంతరం గవర్నర్‌ ఇద్దరు సీఎంలతో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు.  

అపరిష్కృత అంశాలపై చర్చ?
రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు కావొస్తోంది. పునర్విభజన చట్టం మేరకు జరగాల్సిన వివిధ సంస్థల విభజన, ఉద్యోగుల విభజన వంటి అంశాలెన్నో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని పలు అంశాలు, కార్పొరేషన్లు, హైకోర్టు విభజన తదితర ప్రక్రియలేవీ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ భేటీలో సాగునీటి పంపకాలు సహా పలు అపరిష్కృత అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీ సానుకూలంగానే జరిగిందని, ఇక ముందు కూడా సీఎంల స్థాయిలో ఇలాంటి భేటీ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఉల్లాసంగా కార్యక్రమం
గవర్నర్‌ నరసింహన్‌ ప్రత్యేకంగా ఆహ్వానించిన మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ కూడా ఎట్‌ హోమ్‌కి హాజరయ్యారు. కార్యక్రమంలో ఇద్దరు సీఎంలు గవర్నర్‌కు చెరోవైపు కూర్చున్నారు. మధ్యలో ఒకసారి గవర్నర్‌ లేచి వెళ్లగా కేసీఆర్‌ చంద్రబాబు పక్కన కూర్చుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, పవన్‌ కల్యాణ్‌ ముచ్చటించుకుంటూ కనిపించారు. కార్యక్రమం ముగిశాక ఇద్దరు సీఎంలను తీసుకుని గవర్నర్‌ రాజ్‌భవన్‌లోకి వెళ్లగా.. సుమారు ఐదు నిమిషాల తర్వాత పవన్‌ కల్యాణ్‌ కూడా లోనికి వెళ్లారు.

గవర్నర్‌తో పవన్‌ కొంతసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎంల భేటీ అంశాలుగానీ, పవన్‌తో భేటీ విషయాలు కానీ బయటికి రాలేదు. ఎట్‌హోం కార్యక్రమంలో కేంద్రమంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర డిప్యూటీ సీఎంలు కడి యం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఈటల రాజేందర్, సీఎల్పీ నేత జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీలు కేశవరావు, డీఎస్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర మాజీ సీఎస్‌ రాజీవ్‌శర్మ, రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు