మా కష్టం కనరా?

20 Apr, 2020 08:04 IST|Sakshi
చంద్రసుప్రియ, కిరణ్‌కుమార్‌ దంపతులు

సఫిల్‌గూడలో అంధ దంపతుల ఆవేదన

లాక్‌డౌన్‌ వేళ మందులు, ఆర్థిక అవసరాలకు అవస్థలు

హెల్ప్‌లెస్‌గా మారిన హెల్ప్‌లైన్లు

సాక్షి, సిటీబ్యూరో: కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌ కళ్లున్న వాళ్లనే కాదు..చూపు లేని వాళ్లచేతా కంటతడి పెట్టిస్తోంది. తోడులేందే గడపదాటలేని అంధులు ఇంట్లోనే బందీ అయ్యారు. హెల్ప్‌లైన్లు సకాలంలో స్పందించక, ఒంటరిగా బయటకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్న అంధజంట తమకు సహాయం కోసం ‘సాక్షి’ని ఆశ్రయించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఓల్డ్‌ సఫిల్‌గూడ డీవీ టౌన్‌షిప్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అడ్వకేట్‌ చంద్ర సుప్రియ, ఆమె భర్త కిరణ్‌కుమార్‌లు ఇద్దరూ అంధులే. వీరు నివసించే ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించటంతో ఇంటికి ఎవరినీ అనుమతించటం లేదని, మందులు, ఇతర అత్యవసరాల కోసం ఎవరో ఒకరు సహాయం లేకుండా వెళ్లలేని స్థితి అని ఆమె ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘రెగ్యులర్‌గా అంటే ఇంట్లో  అలవాటైన రోజూ వారి పనులు చేసుకోగలుగుతాం కాని తోడులేందే బయటకు అయితే వెళ్లలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినంటే వాళ్లను సహాయం అడగలేం కదా. అదీగాక ఏ వస్తువేదో స్పృశించి తెలుసుకోవాలి. దీనివల్ల కరోనాకు వల్నరబుల్‌గా ఉంటున్నాం. స్నేహితులు, చుట్టాలెవరికైనా ఫోన్‌ చేసి..ఫలానా సరుకులు తెచ్చిపెట్టండి అని రిక్వెస్ట్‌ చేద్దామన్నా బయటి వాళ్లెనవరినీ మా అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వడం లేదు. మాకు డిజేబులిటీ కారణంగా మా వంటమనిషి విషయంలో మాత్రం మాకు వెసులుబాటు కల్పించారు.  కూరగాయల దగ్గర్నుంచి సరుకుల మొదలు ప్రతి చిన్న విషయానికీ ఆమె మీదే ఆధారపడుతున్నాం. బంద్‌ వల్ల మాకు ఆదాయం సున్నా. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. పైగా నేను డయాబెటిక్‌. రోజూ ఇన్సులిన్‌ తీసుకోవాల్సిందే. నర్సు వచ్చి ఇవ్వడానికి కుదరట్లేదని మా వారే ఇస్తున్నారు.  చాలా ఇబ్బందులు ఫేస్‌ చేస్తున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

వందకు డయల్‌ చేసినా...
మా ఇబ్బందులపై వందకు డయల్‌ చేస్తే నో రెస్పాన్స్‌. డిజేబుల్డ్‌ వాళ్ల కోసం హెల్ప్‌లైన్‌ ఉందని అడ్వయిజరీ కమిటీ ఆన్‌ డిజేబులిటీ కమిటీ మెంబర్‌ని అయిన నాకే తెలియలేదు. అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ చెప్పేదాకా. మిగిలిన వాళ్ల మాటేమిటి? ఆ హెల్ప్‌లైన్‌నూ టాటా ట్రస్ట్‌ కొలాబరేషన్‌తో నిర్వహిస్తోంది  అయినా కేవలం సర్వీసే..ఆర్థిక సహాయం లేదు.మా కోసం కేటాయించిన ఫండ్స్‌ను ఇలాంటి టైమ్‌లో వినియోగించొచ్చు కదా? డోనర్స్‌ మీద ఎందుకు ఆధారపడాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు దక్షిణ భారతదేశంలోనే ఏకైక విజువల్లీ చాలెంజ్డ్‌ మహిళా అడ్వకేట్‌ అయిన చంద్ర సుప్రియ. అంతేకాదు కలామ్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పడు ఆయన చేతుల మీదుగా రోల్‌ మోడల్‌ ఆఫ్‌ ఇండియా అవార్డ్‌నూ అందుకున్నారామె.

మరిన్ని వార్తలు