‘అనుమతిచ్చారు.. లేదు ఇవ్వలేదు’

10 Jul, 2018 19:06 IST|Sakshi

పరిపూర్ణానంద స్వామిపై వేధింపులు ఆపాలి : బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు

సాక్షి, హైదరాబాద్‌ : పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్బంధం చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మండిపడ్డారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రను పోలీసులు అడ్డుకుని ఆయనను గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రామచంద్రరావు మంగళవారం మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామి యాత్రకు పోలీసులే అనుమతి ఇచ్చారని, తిరిగి పోలీసులే యాత్ర చేయకుండా గృహ నిర్బంధం చేశారని అన్నారు.

కనీసం ఇతరులు కూడా ఆయనను కలవడానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, ఏం నేరం చేశారని నిర్బంధించారని ప్రశ్నించారు. పోలీసులే అనుమతినిచ్చి.. తిరిగి రద్దు చేయడమేంటన్నారు. స్వామిజీ వెంట వెళ్లే 400 మందికే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం నాలుగు కోట్ల మంది ప్రజలకు ఎలా రక్షణ ఇస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే గృహ నిర్బంధం రద్దు చేసి.. స్వామిజీపై వేధింపులు ఆపాలని రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. కాగా, పరిపూర్ణానందకి తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు