జనులారా.. వినరేల!

13 May, 2020 10:47 IST|Sakshi

కరోనా వెంటాడుతోంది.. జాగ్రత్త

గ్రేటర్‌లో కరోనా కరాళ నృత్యం

నగరవాసిని ముప్పు తిప్పలు పెడుతున్న వైరస్‌

తగ్గినట్టే తగ్గి.. మళ్లీ విజృంభిస్తున్న వైనం

అయినా లాక్‌డౌన్‌ను పట్టించుకోని జనం

విచ్చలవిడిగా రోడ్లపైకి.. నిబంధనలు గాలికి

11 రోజుల్లో 222 పాజిటివ్‌ కేసులు నమోదు

ఒక్కరి ద్వారా కుటుంబ సభ్యులందరికీ..

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. నగరవాసిని ముప్పు తిప్పలు పెడుతుంది. ఇంట్లో ఏ ఒక్కరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినా..ఆ కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తోంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వారికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం వైరస్‌ ఉధృత్తి తగ్గినట్లే తగ్గి...ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సిటీజనుల తీరు మరింత ఆందోళన కలిగిస్తోంది. గత కొద్దిరోజులుగా సిటీలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జనం ఇష్టారీతిలో రోడ్లపైకి వస్తున్నారు. సోషల్‌ డిస్టెన్స్, మాస్క్‌ల వాడకాన్నీ గాలికి వదిలేస్తున్నారు. దీంతో వైరస్‌ మరింత మందికి సోకే ప్రమాదం పొంచి ఉంది. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో 620 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 26 మంది చనిపోయారు. ఇక ఈ నెలలో కేవలం 11 రోజుల్లోనే 222 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఈ మరణాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. 

ప్రభుత్వం ఒకటి తలిస్తే.. సిటీజనులు మరోలా..
వైరస్‌ సామాజిక వ్యాప్తి జరగకుండా లాక్‌డౌన్‌ ఆపగలిగిందనడంలో సందేహం లేదు. కేసుల సంఖ్య తక్కువగా నమోదు కావడానికి కూడా ఇదే కారణం. వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో  ప్రభుత్వం తీవ్రతను బట్టి జిల్లాలను గ్రీన్, ఆరెంజ్, రెడ్‌ జోన్లుగా విభజించి, ఆ మేరకు ఆయా జోన్లలో లాక్‌డౌన్‌ ఆంక్షలను కొంతవరకు సడలించింది. ప్రజల జీవనోపాధి, ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఆంక్షలను సడలిస్తే..వైరస్‌ పూర్తిగా తగ్గిపోయినందువల్లే ప్రభుత్వం తమను బయటికి అనుమతించిందని జనం భావించారు. ఇక వైరస్‌ తమను ఏమీ చేయ లేదనే ధీమాతో ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నారు. నిత్యవసరాలు, ఇతర కొనుగోళ్ల పేరుతో వైన్‌ షాపులు, మార్కెట్ల ముందు భారీగా గుమిగూడుతున్నారు. విందుల పేరుతో పెద్ద సంఖ్యలో ఒకే చోటకు చేరుతున్నారు. ఇక్కడ కనీస భౌతికదూరం పాటించకపోగా... చాలామంది మాస్క్‌లు కూడా ధరించడం లేదు. దీంతో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా విస్తరించింది. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఒక్కరి నుంచి కుటుంబ సభ్యులందరికీ....
మలక్‌పేట్‌గంజ్‌లో పల్లినూనె వ్యాపారి నుంచి ఆయన భార్య, తల్లిదండ్రులు సహా వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో ఉండే ఆయన సోదరుడు, ఎస్‌కేడీ నగర్‌లో ఉంటున్న వారి సోదరి, బర్త్‌డే పార్టీకి హాజరైన హుడాసాయినగర్‌ కాలనీకి చెందిన సోదరుని అత్త కుటుంబ సభ్యులు ఇలా మొత్తం 25 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  
హుడాసాయినగర్‌కు చెందిన వృద్ధురాలి ద్వారా ఆమె ఇంట్లో పనిచేసే పనిమనిషి సహా కారు డ్రైవర్‌ కుటుంబంలోని మరో ముగ్గురికి వైరస్‌ సోకింది.  
గడ్డిఅన్నారం డివిజన్‌ తిరుమలానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే డయాలసిస్‌ పేషంట్‌ ద్వారా ఆయన భార్య సహా కుటంబంలోని ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఓ మహిళ మృతి చెందడం కలకలం సృష్టించింది.
జియాగూడ, సబ్జిమండి, ఇందిరానగర్, దుర్గానగర్, శ్రీసాయినగర్‌లకు చెందిన రెండు మూడు కుటుంబాల్లోనే సోమవారం ఒక్క రోజే 25 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల ఇక్కడ ఒక మహిళ సహా మరో ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగి ఇదే వైరస్‌తో చనిపోగా...వీరి మరణాలను ప్రభుత్వం ఇప్పటి వరకు ధృవీకరించక పోవడం గమనార్హం.
మేడిపల్లి పీఎస్‌లో పని చేసే కానిస్టేబుల్‌ కుటుంబంలో తొమ్మిది మందికి పాజిటివ్‌ రాగా, వీరిలో ఒక వృద్ధుడు చనిపోయారు. వీరి ద్వారా ఇంటి పక్కన ఉండే కార్పెంటర్‌కు ఆయన కుటుంబంలోని మరో ముగ్గురికి వైరస్‌ సోకింది.
బేగంబజార్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ద్వారా ఆయన తండ్రి, తమ్ముడు, భార్య, ఇద్దరు కుమారులకు వైరస్‌ సోకింది.  
మలక్‌పేట్, కింగ్‌కోఠి, కుషాయిగూడ, డబీర్‌పురాలోని బీబీకాఆలాం, కామటిపుర, ముషీరాబాద్‌ దయార్‌కమాన్, జవహార్‌నగర్‌బస్తీ, సైదాబాద్‌ మాదవనగర్, అల్లాపూర్‌లోని రాజీవ్‌గాంధీనగర్, కవాడిగూడ భాగ్యలక్ష్మీనగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్‌ విజయా డయాగ్నోస్టిక్స్, నవీన్‌నగర్‌లలోనూ కేసులు భారీగా వెలుగు చూశాయి. కుటుంబంలో ఒక్కరి ద్వారా ఐదు నుంచి పది మందికి వైరస్‌ విస్తరించింది. దీంతో వారందరికీ పరీక్షలు నిర్వహించి, గాంధీలో అడ్మిట్‌ చేయాల్సి వచ్చింది.   
పాత అల్వాల్‌ పంచశీల కాలనీలో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిరా>్ధరణ కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. 

కింగ్‌ కోఠిలో 13 పాజిటివ్‌ కేసులు
కింగ్‌కోఠి ఆస్పత్రి ఓపీకి మంగళవారం 48 మంది రాగా, వీరిలో కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న ఏడుగురిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. సోమవారం నమూనాలు సేకరించిన వారిలో 15 మందికి పాజిటివ్‌ రావడంతో వారిని గాంధీకి తరలించారు. నెగిటివ్‌ వచ్చిన 13 మందిని హోం క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మరో 45 మంది అనుమానితులు ఉన్నారు. ఇక ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రికి ఓపీకి 19 మంది రాగా వీరిలో 16 మందిని ఇన్‌ పేషంట్లుగా అడ్మిట్‌ చేశారు. ఆయుర్వేద ఆస్పత్రిలో 127 మంది ఉన్నారు. వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. యునానీ ఆస్పత్రిలో ఉన్న 55 మందికి నెగిటివ్‌ రావడంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో తాజాగా మరో ఎనిమిది మంది అనుమానితులు అడ్మిటయ్యారు.  ఇప్పటికే ఇక్కడి ఐసోలేషన్‌వార్డులో ఉన్న పది మందికి నెగిటివ్‌ రావడంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

ఒకే అపార్ట్‌మెంట్‌.. 10 మందికి పాజిటివ్‌ వృద్ధురాలి మృతి
చెతన్యపురి: గడ్డిఅన్నారం డివిజన్‌లోని తిరుమలనగర్‌లోని ఓ అపార్టుమెంటులో 75 సంవత్సరాల రిటైర్డ్‌ టీచర్‌కు కరోనా పాజిటివ్‌ రావటంతో పదిరోజుల క్రితం గాంధి ఆసుపత్రికి తరలించారు.  అతనికి పరీక్షలు చేసి హౌజ్‌ క్వారంటైన్‌లో ఉంచి పాజిటివ్‌ అని వచ్చిన తరువాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే మూడు రోజులక్రితం అతని భార్య (65)కు శ్వాసతీర్చుకోవటం ఇబ్బందిగా మారటంతో ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే టెస్ట్‌ రిజల్ట్‌ రాకముందే  పరిస్థితి విషమించి   మృతిచెందింది,  దీందో కుమారుడు, కోడలికి పరీక్షలు చేయగా పాజిటివ్‌ రావటంతో వారినీ గాంధీకి తరలించారు. ఇంకా అదే అపార్టుమెంటులో రిటైర్డ్‌ టీచర్‌ కూతురు, కోడలు మరో నలుగురు కుటుంబ సభ్యులను, వాచ్‌మెన్‌ కుటుంబాన్ని  కూడా అధికారులు ఐసోలేషన్‌కు తరలించి కోవిడ్‌ పరీక్షలు చేశారు. వారిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది.  ఇదే కుటుంబం అల్లుడు అయిన ఓ ప్రముఖ తెలుగు నటి కుమారుడుకు కూడా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. 

కరోనా రౌండప్‌ మాదన్నపేట్‌లో తండ్రీకూతురుకు..
చంచల్‌గూడ:  కుర్మగూడ డివిజన్‌ మాదన్నపేట షోలేనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ కుటుంబంలో గత ఆదివారం  ఏడుగురికి  పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్‌కు తరలించగా తండ్రి (42)తో పాటు 11 నెలల కూతురికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆ అపార్టమెంట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో స్ప్రే చల్లారు. 

విజయ డయాగ్నస్టిక్‌ సిబ్బందికి...
రాంగోపాల్‌పేట్‌: ఎస్డీరోడ్‌లోని విజయ డయాగ్నస్టిక్‌ కేంద్రంలో పనిచేస్తూ కరోనా పాజిటివ్‌ ఉద్యోగినితో కాంటాక్టులో ఉన్న 10 మంది ఉద్యోగులకు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించారు.     ఫలితాలు మరో48 గంటల్లో రానున్నాయి. 

ఊపిరి పీల్చుకుంటున్న వనస్థలిపురం వాసులు
వనస్థలిపురం: వనస్థలిపురంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్న కాలనీ ప్రజలు ఇపుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. మూడు రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం, పాజిటివ్‌ వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారందరికీ  పరీక్షలలో నెగిటివ్‌ రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆల్వాల్‌లో ఒకరికి పాజిటివ్‌
అల్వాల్‌: అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని ప్రగతిశీల  కాలనీలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది.   పాత అల్వాల్‌లోని ప్రగతిశీల కాలనీలో నివసించే ఓ వ్యక్తి (44) ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నారు.  అతని తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో క్షయ వ్యాధికి చికిత్స పొందుతోంది. ఆమెను చూసేందుకు తరచూ ఆస్పత్రికి వెళ్లేవారు. ఇటీవల జ్వరం, దగ్గుతో బాధపడటంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. మంగళవారం ఉదయం  గాంధీ ఆసుపత్రికి తరలించారు. భార్య, ఇద్దరుపిల్లలు, పనిమనిషిని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయనున్నారు.

కోవిడ్‌ బారిన కార్పెంటర్‌
ఉప్పల్‌: ఉప్పల్‌ న్యూభరత్‌నగర్‌లో నివసించే కార్పెంటర్‌(40)కు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు అతనిని గాంధీకి తరలించారు.  భార్య, తల్లి, ఇద్దరు కుమారులను క్యారెంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. 

ఒకరి మృతి..
జియాగూడ:  జియాగూడలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.  ఇందిరానగర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి (65) ప్లాస్టిక్‌ కార్ఖానా నిర్వహిస్తున్నాడు. ఇటీవల టైఫాయిడ్, ఇతర ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

ఓ మహిళకు పాజిటివ్‌...
జియాగూడ ఇందిరానగర్‌లో నివసిస్తున్న ఓ గృహిణి(36)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  దీంతో ఆమెకు గాంధీలో చికిత్స అందిస్తున్నారు.

మీర్‌పేటలో ఒకరికి కరోనా పాజిటివ్‌
మీర్‌పేట: మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలి (45)కి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు