కళాభారతి డిజైన్‌కు సీఎం ఆమోదం

20 Apr, 2015 01:39 IST|Sakshi
కళాభారతి డిజైన్‌కు సీఎం ఆమోదం

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మించతలపెట్టిన ‘తెలంగాణ కళాభారతి’ డిజైన్‌కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. తెలంగాణ చరిత్రను స్ఫురణకు తెచ్చేలా... వారసత్వ కట్టడాలకు అద్దం పట్టేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కళాభారతి కోసం డిజైన్ రూపొందించారు. 14 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ కట్టడానికి కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం పౌర సంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

దీనిలో  4 ఆడిటోరియాలను నిర్మిస్తారు. వాటిలో 500, 1,000, 1,500 మందికి సరిపడే మినీ, మీడియం ఆడిటోరియాలతో పాటు 3,000 మంది పట్టే పెద్ద ఆడిటోరియం కూడా ఉంటుంది. 125 ఇన్‌టూ 125 చదరపు మీ టర్ల వైశాల్యంలో లక్షా ఇరవై ఐదు వేల చదరపు అడుగుల మేర కళాభారతిని నిర్మిస్తారు.
 
అందమైన ప్రాంగణం.. సకల సౌకర్యాలు
కళాభారతి ప్రాంగణంలో ఆహ్లాదాన్ని కలి గించే పచ్చిక బయళ్లు, నీటి కొలనులు, ఫౌంటేన్‌లను నిర్మిస్తారు. రెండు వైపులా పెద్ద గేట్లు, తూర్పు వైపున ఆర్చ్‌తో కూడిన ప్రధాన గేటు ఉంటుంది. కళాభారతిలో అంతర్భాగంగానే అత్యాధునిక థియేటర్, ప్రివ్యూ థియేటర్, కళాకారుల శిక్షణ- రిహార్సల్స్ కోసం ప్రత్యేక హాళ్లు, లైబ్రరీ, ఆర్ట్ మ్యూజియం గ్యాలరీ, పెయింటింగ్ గ్యాలరీ, శిల్పాకృతుల గ్యాలరీ, వీఐపీ లాంజ్, మీడియా లాంజ్‌లు ఉంటాయి.

25, 50, 100 మందితో సదస్సులు నిర్వహించుకోవడానికి 3 సెమినార్ హాళ్లు, డార్మిటరీ సౌకర్యం, అతిథి గృహాలు, మూడు రెస్టారెంట్లు, 40 గదులు, 10 సూట్లు, 1,000 మంది పట్టే ఫుడ్ కోర్టు ఉంటాయి. లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ వంటి విభాగాల నిర్వహణ కోసం కార్యాలయాల నిర్మాణం కూడా ఇందులోనే ఏర్పాటు చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు