ఆపత్కాలంలో దేవునిలా..

15 Apr, 2020 13:26 IST|Sakshi
మందులు అందజేస్తున్న సీపీ సత్యనారాయణ

హైదరాబాద్‌ నుంచి మందులు తెప్పించి ఇచ్చిన పోలీసులు

పాదాభివందనం చేసిన బాధితురాలు

గోదావరిఖని(రామగుండం): ప్రాణాపాయ స్థితిలో కిడ్నీ మార్చుకున్న ఓ నిరుపేద మహిళకు హైదరాబాద్‌ నుంచి మందులు తెప్పించి దేవునిలా నిలిచారు గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు. మంగళవారం రామగుండం పోలీస్‌కమిషనర్‌ వి.సత్యనారాయణ చేతుల మీదుగా బాధితురాలికి అందజేశారు. గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన కాళేశ్వరం రజిత కిడ్నీ మార్చుకుంది. ఇన్‌ఫెక్షన్‌ కాకుండా నిత్యం మందులు వాడటం తప్పనిగా మారింది. లాక్‌డౌన్‌ కారణంతో మందులు తెచ్చుకోలేక పోయింది. గతనెలాఖరుతో మందులు పూర్తిగా అయిపోయాయి. అయితే లాక్‌డౌన్‌ ఉండటంతో మందులు లేకుండానే రోజులు వెళ్లదీస్తూ వస్తోంది. దీంతో కడుపు వాపు రావడంతో మందుల కొనుగోలు తప్పనిసరైంది. అయితే మందులు లాక్‌డౌన్‌ కావడంతో హైదరాబాద్‌కు వెళ్లడం కూడా వారికి కష్టంగా మారింది.

ఈక్రమంలో మహిళ మూడు రోజుల కిందట తాను హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించాలని గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ పర్శ రమేష్‌ను కోరింది. ఎలా వెళ్తారని ప్రశ్నించడగా తమకు అనుమతి ఇస్తే ద్విచక్రవాహనంపై వెళ్లి తెచ్చుకుంటామని కన్నీళ్ల పర్యంతమైంది. తన భర్తకు పెద్దగా తెలియదని, ఇద్దరం కలిసి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. వీరి పరిస్థితి గమనించిన సీఐ పర్శ రమేష్‌ తాను టాబ్లెట్లు తెప్పిస్తానని చెప్పి మెడికల్‌ ఏజెన్సీద్వారా హైదరాబాద్‌ నుంచి మందులు తెప్పించారు. ఈమేరకు మంగళవారం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ చేతుల మీదుగా బాధిత మహిళకు అందజేయడంతో కన్నీటి పర్యంతమై సీఐ కాళ్లు మొక్కింది. మీరు ఆదుకోకుంటే జీవితం మరింత నరకంగా మారేదని తెలిపింది. కాగా మానవత్వంతో స్పందించి ఓకుటుంబానికి అండగా నిలిచిన వన్‌టౌన్‌ సీఐ రమేష్‌ను సీపీ సత్యనారాయణ, ఏసీపీ ఉమేందర్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు