నింగి నుంచి భూమి సర్వే..

23 Jan, 2018 17:48 IST|Sakshi

జీఐఎస్‌ ద్వారా భూముల సర్వే

ఆ తర్వాత సర్వే నంబర్ల వారీగా జియో ట్యాగింగ్‌

కర్ణాటక తరహాలో హద్దులు

భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వ యోచన

మరింత పారదర్శకంగా భూకొనుగోళ్లు, అమ్మకాలు 

మహబూబ్‌నగర్‌/మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణితో పాటు సర్వే ల్యాండ్‌ రికార్డుల కార్యాలయాలకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. తమ
భూమి సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఆ ఫిర్యాదుల్లో పలువురు కోరుతుంటారు. శాశ్వత పరిష్కారం కోసం వీరందరూ ఎదురుచూస్తున్నా ఫలితం ఉండడం లేదు.
ఈక్రమంలో నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ రికార్డుల ప్యూరిఫికేషన్‌కు చర్యలు చేపట్టింది. అయితే, రికార్డుల
వరకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా జియోగ్రాఫిక్‌ ఇన్‌ఫర్మాటిక్‌ సిస్టమ్‌(జీఐఎస్‌) సర్వే నిర్వహించాలని
యోచిస్తోంది. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలో రికార్డుల ప్యూరిఫికేషన్‌ సర్వే సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎదురైన సమస్యలు, వాటిని
అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే జీఐఎస్‌ ద్వారా భూముల సర్వే చేపడితే ఎలా ఉంటుందనే సాధ్యాసాధ్యాలపై కూడా ముఖ్యమంత్రి
కేసీఆర్‌ చర్చించి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూత్రప్రాయంగా నిర్దేశించినట్లు తెలిసింది.  

రెవెన్యూ శాఖ ప్రక్షాళన 
రెవెన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే భూముల లెక్క తేల్చడంతో పాటు రికార్డుల
ప్యూరిఫికేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో రికార్డులకు, క్షేత్ర స్థాయికి తేడాలు ఉన్నట్లు అధికారులు గమనించారు. భూప్రక్షాళన కార్యక్రమం ద్వారా
ఆశించిన ఫలితాలు రావాలంటే మరిన్ని చర్యలు అవసరమని భావించిన ప్రభుత్వం జీఐఎస్‌ ల్యాండ్‌ సర్వే చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా
భూరికార్డులు, హద్దుల విషయంలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ మేలు 
జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(జీఐఎస్‌) ద్వారా భూముల సర్వే చేపడితే భూయాజమానులకు మేలు జరగడంతో పాటు రికార్డుల నిర్వహణ సైతం పారదర్శకమవుతుంది.
సర్వే నంబర్ల వారీగా నిర్ణయించే హద్దుల మేరకు వాస్తవంగా భూమి విస్తీర్ణం, నక్షాలు రూపొందిస్తారు. పట్టాదారుల విస్తీర్ణం తేల్చి తర్వాత హద్దులు నిర్ణయిస్తారు. వీఆర్వో,
సర్వేయర్లు ఇచ్చే రిపోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వీఆర్వో, సర్వేయర్ల రిపోర్టును తప్పని సరిచేయడంతో పాటు కొనుగోలు చేసిన భూమికి పక్కా కొలతలు నిర్ణయిస్తారు.
దీని ప్రకారం రిజిస్ట్రేషన్, ముటేషన్‌ రికార్డుల్లో నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో కొలతలకు సంబంధించి ఇబ్బందులు ఉండవు. అలాగే, ఎవరైనా భూమి కొలతల సమస్యతో
అధికారుల వద్దకు వస్తే పరిష్కరించడం సులువవుతుంది.

సర్వే నంబర్ల జియో ట్యాగింగ్‌ 
జీఐఎస్‌ సర్వే ద్వారా భూకొలతలు చేపట్టాక కర్ణాటక తరహాలో సర్వే నంబర్ల వారీగా హద్దులు నిర్ణయించి సర్వే నంబర్లను జియో ట్యాగింగ్‌ చేస్తారు. వచ్చే నెలలో జరగనున్న
ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆలోచన మేరకు జీఐఎస్‌ ల్యాండ్‌ సర్వే నిర్వహిస్తే భూప్రక్షాళన
ఆశయం నెరవేరడమే కాకుండా భూ యాజమానులకు కొలతలు, హద్దులు, రికార్డుల పరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశముంది. ఇందులో భాగంగా సర్వే నంబర్లను
జియో ట్యాగింగ్‌ చేస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. గతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని తహసీల్దార్లకు సూచిస్తే కొన్ని
మండలాల్లో ప్రభుత్వ భూములు లేవని చెప్పడం, భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతుండడం ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అదే సర్వే నంబర్లను జియో ట్యాగింగ్‌ చేస్తే
వాస్తవంగా ఎంత భూమి అందుబాటులో ఉందో తెలిసిపోనుంది. 

త్వరలో సర్వే
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తహసీల్దార్లతో ఈనెల 17న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమావేశంలో
చర్చకొచ్చిన అంశాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న హద్దుల సమస్యను అన్ని జిల్లాల అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా
జీఐఎస్‌ సర్వే నిర్వహించి భూప్రక్షాళన ఫలితాలను ప్రజలకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా