నడిగడ్డలో కోరలు చాస్తున్న కరోనా

7 Apr, 2020 12:45 IST|Sakshi

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా అనుమానిత కేసులు

హైదరాబాద్‌లోని ప్రయోగశాలల్లో పేరుకుపోతున్న నమూనాలు  

కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాల్లో తీవ్ర జాప్యం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 227 రిపోర్టుల కోసం ఎదురుచూపులు

గద్వాలలో కమ్ముకుంటున్న వైరస్‌.. ఇప్పటికే 11 కేసులు నమోదు

సేఫ్‌ జోన్‌లో వనపర్తి, నారాయణపేట జిల్లాలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. మరోవైపు నిర్ధారణ పరీక్ష ఫలితాల వెల్లడిలో కొనసాగుతున్న జాప్యంతో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లా అధికారుల్లో ఆందోళన నెలకొంది. పది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతూ వస్తోన్న కరోనా పాజిటివ్, అనుమానిత కేసులు ఇటు అధికారులను, అటు ప్రజాప్రతినిధులను కంటి మీద కునుకులేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏడు, జోగుళాంబ గద్వాల జిల్లాలో పదకొండు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండు చొప్పున మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న, ఇతర అనుమానిత వ్యక్తులు మరో 334 మంది గొంతు, ముక్కు నుంచి తీసిన నమూనాలు అధికారులు హైదరాబాద్‌లోని కరోనా నిర్ధారణ కేంద్రాలైన సీసీఎంబీ, ఐపీఎంలకు పంపారు. వీటిలో ఇప్పటికే 107 మందికి నెగిటివ్‌ అని తేలగా.. సోమవారం రాత్రి వరకు వచ్చిన సమాచారం మేరకు 20 మందికి పాజిటివ్‌ వచ్చింది. మరో 227మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 130 రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. గద్వాల జిల్లాలో 57, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 40 రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిలో ఎన్ని రిపోర్టులు పాజిటివ్‌గా వస్తాయి? ఎన్ని నెగిటివ్‌ వస్తాయో అనే ఆందోళన అన్ని జిల్లాల అధికారుల్లో వ్యక్తమవుతోంది. 

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొత్తగా 40 మంది నుంచి తీసుకున్న సమూనాలను సోమవారం సీసీఎంబీ, ఐపీఎంలకు పంపారు. గద్వాల, మహబూబ్‌నగర్‌లో 65 మంది అనుమానితుల నుంచి తీసిన నమూనాలు పంపాలని ఆయా జిల్లాల అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు వారు సీసీఎంబీ, ఐపీఎంలను సంప్రదించగా.. ‘ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి వచ్చిన నమూనాలకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదని, చాలా వరకు పెండింగ్‌లో ఉన్నందునా ఇప్పుడే పంపొద్దు’ అని చెప్పినట్లు ఆయా జిల్లా వైద్యాధికారులు చెప్పారు. ఇప్పటి వరకు వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ.. క్వారంటైన్‌లో ఉన్న వారిపై ప్రత్యేక దృష్టిసారించింది.

నడిగడ్డలో కోరలు చాస్తు్తన్న కరోనా  
వారం రోజుల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా ఇప్పుడు కరోనా పేరు వింటేనే ఉలికిపడుతోంది. ఢిల్లీలో జరిగిన ధార్మిక సభలో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొన్న 127 మందిలో 71మంది గద్వాల జిల్లాకు చెందిన వారే ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారి వివరాలు తెలుసుకుని ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే గద్వాలకు చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌తో చనిపోవడం.. మరో పది మందికి పాజిటివ్‌ రావడంతో ఆ జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. వీరిలో సోమవారం అయిజ పట్టణానికి చెందిన నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు చికిత్స నిమిత్తం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మరో 130 మందికి సంబంధించిన కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.

అధికారుల్లో టెన్షన్‌  
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ రిపోర్టులు వచ్చిన వారితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారు? వారు ఎక్కడెక్కడికి వెళ్లారో అని ఆరా తీసే పనిలో పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించిన అధికారుల దృష్టంతా అనుమానితుల 14 రోజుల గడువు మీదే ఉంది. క్వారంటైన్‌ గడువు పూర్తయ్యే వరకు వీరిలో ఎంత మందికి పాజిటివ్‌ వస్తుంది? ఎంత మందికి నెగిటివ్‌ వస్తుందో అనే టెన్షన్‌ నెలకొంది. మరోవైపు కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వస్తోన్న రోగుల వివరాలు అధికారులకు చెప్పకుండా వచ్చీరాని చికిత్స అందిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులపైనా వైద్యశాఖ దృష్టిసారించింది. ఇప్పటికే కరోనా లక్షణాలతో వచ్చిన షాద్‌నగర్‌ మండలం చేగూరుకు చెందిన ఓ మహిళకు చికిత్స చేసిన మహబూబ్‌నగర్‌లోని అనిల్‌ సర్జరీ కేర్‌ ఆస్పత్రిని అధికారులు సీజ్‌ చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఆ ఆస్పత్రిలో చికిత్స, పరీక్షలు చేయించుకున్న రోగులందరూ వెంటనే జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ కృష్ణ తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు