సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెలోకి...

28 Jun, 2015 19:29 IST|Sakshi

ఉద్యోగ, కార్మిక సంఘాలకు ఐక్య కార్యాచరణ సమితి పిలుపు

హైదరాబాద్: మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరనసలు చేపట్టనున్నారు. గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విన్నవించినా స్పందించకపోవడంతో మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) పిలుపునిచ్చింది. మొత్తం 111 మున్సిపాలిటీల్లో సోమవారం అన్ని కార్మిక సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం నినదించనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే జులై 1నుంచి సమ్మె చేస్తామని జూన్ 16న సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం తాత్సారం చేయడంపై పలు కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. అన్ని మున్సిపాలిటీల్లో సేవలను స్తంభింపచేయాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి.

ఉద్యోగులు, కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే:
మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు 10వ వేతన సవరణ కమిటీ సిఫార్సులు వర్తింపచేయాలి.
ఈ సవరణ ప్రకారం కనీసం వేతనం రూ.15432 ఇవ్వాలి.
ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలి.
ఎన్‌ఎంఆర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలి.
పర్మినెంట్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్లు, హెల్త్ కార్డులు, 010 పద్దు ద్వారా జీతాలు ఇవ్వాలి.
స్కూల్ స్వీపర్స్, ఇతర పార్ట్‌టైమర్లకు కనీస వేతనాలు వర్తింపచేయాలి.

చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు నిరసనలు, సమ్మెకు పిలుపునివ్వడంతో పలు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈమేరకు కార్మిక నాయకులకు ఆహ్వానం అందింది. పురపాలక శాఖ మంత్రి డా.పి.నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో చర్చలు జరగనున్నాయి. "సమస్యలు పరిష్కరించకపోతే యథావిధిగా ప్రకటించినట్టు జులై 1నుంచి సమ్మె చేస్తాం. సమస్యల పరిష్కారానికి ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలూ మద్దతు తెలిపాయి. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమిస్తాం. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరిస్తుందనే ఆశిస్తున్నాం" అని సీఐటీయూ జేఏసీ నాయకులు కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు