ప్రార్థనలు ఇలా..

23 Apr, 2020 08:53 IST|Sakshi

రంజాన్‌లో ఇళ్లలోనే నమాజ్, ఇఫ్తార్, తరావీలు

గృహాల్లో సైతం వీటిపై పలు ఆంక్షలు

మసీదుల ద్వారా అజాన్, ఉపవాస దీక్షల సైరన్‌

వీటిలో కేవలం అయిదుగురికే  అవకాశం

హలీమ్, హరీస్‌ వంటకాలపై నిషేధం

కరోనా కట్టడికి మౌలానాలు, ఉలేమాల నిర్ణయం

సాక్షి, సిటీబ్యూరో: రెండు రోజుల్లో నెలవంక దర్శనమివ్వనుండటంతో రంజాన్‌ పవిత్ర మాసం ఆరంభం కానుంది. ప్రత్యేక ప్రార్థనలతో ముస్లింల ఉపవాస దీక్షలు ప్రారంభమవ్వనున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రంజాన్‌ మాసంలో మసీదుల్లో ప్రవేశం, సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్లకు కట్టడి పడింది. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ నేపథ్యంలో రంజాన్‌ ప్రార్థనలపై ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా  కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ కొనసాగుతున్ననేపథ్యంలో ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్‌ విందులపై ఆంక్షలు విధించి కొన్ని సూచనలు చేయగా, మరోవైపు దేవబంద్‌ దారుల్‌– ఉలూమ్, హైదరాబాద్‌ ఇస్లామిక్‌ విశ్వవిద్యాలయం జామియా– నిజామియా, ఇస్లామిక్‌ ఉలేమాలు, మౌలానా, ముఫ్తీలు ఇస్లామిక్‌ స్కాలర్స్‌ ద్వారా ఫత్వాలు జారీ అయ్యాయి. లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రంజాన్‌ ప్రార్థనలు, ఇఫ్తార్, తరావీలు  ఇళ్లలోనే పూర్తి చేసుకునేందుకు ముస్లింలకు దిశా నిర్దేశం చేశారు. ఇళ్లలో సైతం సామూహిక ప్రార్థనలు, విందులపై ఆంక్షలు విధించారు.  హలీమ్, హరీస్‌ తయారీని బంద్‌ చేస్తున్నట్లు వంటకాల యజమానులు స్వచ్ఛందంగా ప్రకటించారు.

రంజాన్‌లో ఇలా..
ప్రతి మసీదులో ఐదు పూటలు అజాన్‌– నమాజ్‌లు, ఉపవాస దీక్ష సైరన్‌లకు అవకాశం
మసీదులో ఇమామ్, మౌజన్, మసీదు కమిటీకి సంబంధించిన మరో ముగ్గురికి మాత్రమే ప్రార్థనలకు అనుమతి
మసీదులో సామూహిక ఇఫ్తార్‌ విందు, హరీస్‌ వంటకాలకు నో చాన్స్‌
ఇళ్లలోనే ఐదుపూటలా నమాజ్, ఉపవాస దీక్ష సహర్, ఇఫ్తార్‌ విందులు, తరావీ ప్రార్థనలు చేసుకోవాలి. వీటిలోనూ ఆంక్షలు విధించారు
అజాన్‌ చివరిలో ముస్లింలు తమ ఇళ్లలోనే నమాజ్‌ చదవాలని అనౌన్స్‌మెంట్‌  
జకాత్, ఫిత్రాలు పంచడానికి ఇంటివద్ద గుమిగూడకుండా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ పేదవారిని వారి ఇంటి వద్దకు చేర్చాలి.

మరిన్ని వార్తలు