‘ల్యాండ్‌’ కాని ఎయిర్‌పోర్టు

10 Aug, 2019 13:54 IST|Sakshi

ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కొలిక్కి రాని స్థల ఎంపిక 

దేవరకద్ర, మూసాపేట, భూత్పూర్‌ మండలాల్లో అన్వేషణ 

గుడిబండ వద్ద ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్‌ 

ప్రతిబంధకంగా మారిన హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు 

సాక్షి, దేవరకద్ర/ అడ్డాకుల : పాలమూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన స్థలాల అన్వేషణ ఇంకా కొలిక్కి రావడం లేదు. దేవరకద్ర నియోజకవర్గంలోనే ఎయిర్‌పోర్టు నెలకొల్పే అవకాశం ఉందని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రకటించినా ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. తాజాగా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించినా మరో రెండు, మూడు స్థలాలను ఎంపిక చేసి పరిశీలించాలని నిర్ణయించడంతో స్థల ఎంపికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలించిన తర్వాత దేవరకద్ర, మూసాపేట, భూత్పూర్‌    మండలాల్లో కొన్ని ప్రదేశాలను అధికారులు స్థల పరిశీలన నిమిత్తం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేవరకద్ర మండలంలోని చౌదర్‌పల్లి, మూసాపేట విభా సీడ్స్‌ కంపెనీ సమీపంలో, భూత్పూర్‌ మండలంలోని హెచ్‌బీఎల్‌ కంపెనీ సమీపంలో కొన్ని స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దేవరకద్ర, మూసాపేట, భూత్పూర్‌ మండలాల్లో ఏదో ఒకచోట ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

గుడిబండ ఆశలు ఆవిరేనా..? 
గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు కోసం అధికారులు పరిశీలించిన స్థలంలో రెండు ప్రధాన విద్యుత్‌ లైన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవే ప్రతిబంధకాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ స్థలాన్ని పరిశీలించిన సందర్భంలో విద్యుత్‌ లైన్‌పై చాలాసేపు అధికారులు చర్చ చేశారు. లైన్‌ మార్పు చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించిన తర్వాత ఇతర ప్రాంతాల్లో స్థలాలను చూడాలని నిర్ణయించారు. దేవరకద్ర సమీపంలో ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మొదటి ప్రకటన తర్వాత.. 
2018 మార్చి 27న జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ పాలమూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే మొదట అధికారులు గుడిబండ వద్ద స్థల పరిశీలన చేశారు. తర్వాత మూసాపేట మండలంలోని తుంకినిపూర్, వేముల, దాసర్‌పల్లి గ్రామాల వద్ద స్థలాలను చూశారు. ఆ తర్వాత భూత్పూర్‌ మండలంలోని రావులపల్లి వద్ద కూడా స్థలాలను పరిశీలించారు. స్థలాలకు సంబంధించిన మ్యాపులు, ఇతర వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు అప్పట్లో స్థల పరిశీలనకు రాకపోవడంతో ఎయిర్‌పోర్టు అంశం మూలకు పడింది. తాజాగా మళ్లీ ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై అధికారులు స్థలాలను పరిశీలిస్తుండటంతో ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.  

జాతీయ రహదారికి సమీపంలో.. 
విమానాశ్రయం ఏర్పాటుకు స్థల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో దానికి రోడ్డు మార్గం కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎయిర్‌ పోర్టుకు జాతీయ రహదారి దగ్గరగా ఉండాలని ఏవియేషన్‌ అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్‌ మండలాలు మాత్రమే హైవేకు దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూడు మండలాలనే పరిగణలోకి తీసుకుంటే గుడిబండనే అన్నింటికీ అనుకూలంగా ఉండనుంది. ఒకవేళ రవాణా మార్గాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకుంటే దేవరకద్ర మండలం వైపు అధికారులు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌అండ్‌బీ అధికారులు ఇటీవల పరిశీలించిన స్థలాల వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా