ఆర్టీసీ సమ్మె: మా టికెట్‌ రిజర్వేషన్ల సంగతేంటి?

5 Oct, 2019 09:43 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌ : సద్దుల బతుకమ్మ, దసరా పండగకు సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్న ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు భారీ షాక్‌ ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో శుక్రవారం అర్దరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్సులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూసిన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది.  అయితే ముందుగా ప్లాన్‌ చేసుకొని టికెట్‌ రిజర్వేషన్లు చేసుకున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది. రిజర్వేషన్లు చేసుకున్న వారికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తారా లేక టికెట్‌ కాన్సిల్‌ చేసి తిరిగి డబ్బులు ఇచ్చేస్తారా అనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టతనివ్వటం లేదు.

దీంతో తమ ప్రయాణానికి సంబంధించి ముందుగా రిజర్వేషన్లు చేసుకున్నవారు ప్రయాణానికి సిద్దం కావాలా లేక రద్దు చేసుకోవాలో తెలియక డైలమాలో పడ్డారు. అంతేకాకుండా టికెట్‌ రిజర్వేషన్‌ను ఇప్పుడు(సమ్మె కారణంగా) రద్దు చేసుకున్నా డబ్బులు కట్‌ అవుతున్నాయని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. అయితే ప్రయాణం రద్దు చేసుకుని, టికెట్లను కాన్సిల్‌ చేయకుండా ఉంటే డబ్బులను తిరిగి ఇస్తారో లేదో అని మరికొందరు అనుమానపడుతున్నారు. ఇక ఈ విషయమై అడుగుదామని మహాత్మా గాంధీ బస్ స్టేషన్కు పలువురు వెళితే సమాచార, రిజర్వేషన్‌ కౌంటర్లు మూసి ఉండటంతో కంగుతింటున్నారు. దీంతో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారి సంగతేంటో అధికారులు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

చదవండి: 
లైవ్‌ అప్‌డేట్స్‌:  నిలిచిన బస్సులు.. ప్రయాణికుల కష్టాలు
డ్యూటీలోకి రాకుంటే.. వేటేస్తాం..

>
మరిన్ని వార్తలు