కోలుకున్నవారు..కోవిడ్‌పై వార్‌

2 Jul, 2020 11:39 IST|Sakshi

 రాష్ట్రంలో ప్లాస్మా దాతల అసోసియేషన్‌ ఏర్పాటు 

 కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి రక్త నమూనాలతో చికిత్స 

 అందరినీ ఏకం చేస్తున్న టీపీసీసీ కోశాధికారి గూడూరు

 కోలుకున్నవారితో రెండు వేలమందికి చికిత్స చేసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారిపై పోరు ముమ్మరమవుతోంది. కోవిడ్‌ కట్టడికి లాక్‌డౌన్‌ పాటించి ప్రజలు సామాజిక స్ఫూర్తిని చాటారు. ఇప్పుడు కోవిడ్‌ బాధితులను గండం నుంచి గట్టెక్కించేందుకు సరికొత్త ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ వ్యాధి సోకి ఆ తర్వాత కోలుకున్నవారి ప్లాస్మాతో రోగులను కాపాడే ప్రక్రియకు బీజం పడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్లాస్మా దాతల అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రకటించారు. ఇటీవల ఆయన కోవిడ్‌ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

అసోసియేషన్‌ ఏర్పాటు ద్వారా ప్లాస్మా థెరపీ చికిత్స ప్రాధాన్యతను చాటాలని ఆయన భావిస్తున్నారు. కోవిడ్‌ బాధితులకు ప్లాస్మా థెరపీ చికిత్సను అందించే ఉద్దేశంతో ముందుకెళుతున్నట్టు గూడూరు వెల్లడించారు. తీవ్ర పరిస్థితుల్లో ఉన్న కోవిడ్‌ రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా నయం చేయవచ్చని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. 500 మంది సీరియస్‌ రోగులకు ప్లాస్మా థెరపీ అందించే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం ’ప్లాటినా’పేరుతో ఓ ప్రాజెక్టును తలపెట్టింది. తెలంగాణలో ఇప్పటి వరకు 7,294 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా, వారిలో ఇద్దరి ప్లాస్మాతో ఒక కోవిడ్‌ వ్యాధిగ్రస్తునికి చికిత్స చేసే వీలుంది. ప్లాస్మాను దానం చేయడానికి మన రాష్ట్రంలో కూడా చాలామంది సుముఖంగా ఉన్నా వారిని ఏకతాటిపైకి తెచ్చే యంత్రాంగం లేకుండా పోయింది. ఇప్పుడు అసోసియేషన్‌ ఏర్పాటుతో ప్లాస్మా దాతలంతా ఒక్క చోటకు చేరే అవకాశముంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారితో 2000 మందికి పైగా చికిత్స చేసే అవకాశం ముందని నిపుణులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు