శుభకార్యాలకు సెలవ్‌!

1 Jan, 2019 11:01 IST|Sakshi

5 నుంచి శూన్యమాసం ప్రారంభం

ముహూర్తాలు ఫిబ్రవరి 7నుంచే..  

నిజామాబాద్‌ కల్చరల్‌ : వివాహ, గృహ ప్రవేశ తదితర శుభ కార్యాలకు అవసరమైన ముహూర్తాలు సోమవారంతో ముగిసాయి. జనవరి 5 నుంచి శూన్య మాసం ప్రారంభమై ఫిబ్రవరి 5 వరకు ఉంటుంది. తిరిగి వివాహ, గృహ ప్రవేశాలు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి.
 
పుష్యం శని దేవునికి ప్రీతికరం 
తెలుగు సంవత్సరాది పన్నెండు నెలల్లో 10వ నెల పుష్య మాసం. జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ కాలాన్ని జ్యోతిష్య శాస్త్రంలో శూన్యమాసంగా పేర్కొంటారు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తూ మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి చెందిన రేఖ నుంచి కర్కాటక రాశికి చెందిన రేఖపై సూర్యగమనం ఉంటుంది. మకర రాశిపైన శని దేవుని ప్రభావం అధికంగా ఉంటుంది. అందు కోసం ఈ మాసంలో శని ప్రీతి కోసం నవగ్రహ ఆరాధనలు పిండివంటల్లో నువ్వులు అధికంగా వాడుతారు.
 
ఫిబ్రవరి 9న వసంత పంచమి  
చదువుల తల్లి సరస్వతీమాత జన్మతిథి వసంత పంచమి. ఈ పర్వదినాన్ని ఫిబ్రవరి 9న జరుపుకుంటారు. నాటి నుంచి వివాహ గృహ ప్రవేశ, శంకుస్థాపనలు తదితర అనేక శుభ ముహూర్తాలు ఆరంభమవుతాయి. వసంత పంచమి నాడు అక్షరభ్యాసం చేస్తే పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందని పెద్దలంటారు. గృహ ప్రవేశం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతుందనే నమ్మకం. ఆ రోజున వివాహం చేసుకుంటే దాంపత్యం దీర్ఘకాలం కొనసాగుతుందని పండితులు చెబుతారు.

మరిన్ని వార్తలు