సర్వర్ సమస్యలతో ‘నామ్’ సతమతం

4 Sep, 2016 02:06 IST|Sakshi
సర్వర్ సమస్యలతో ‘నామ్’ సతమతం

రద్దీవేళల్లో మార్కెటింగ్ ప్రక్రియలో ఇబ్బందులు..
రైతుల పాట్లు సమస్యలు పరిష్కరించాలంటూ హరీశ్ లేఖ

సాక్షి, హైదరాబాద్: జాతీయ వ్యవసాయ మార్కెటింగ్(నామ్) పథకం సాంకేతిక సమస్యలతో సతమతమవుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో పారదర్శకతను పెం చేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం నామ్ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 214 వ్యవసాయ మార్కెట్లను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నామ్ పథకం కింద రాష్ట్రం నుంచి 44 మార్కెట్లను ఎంపిక చేయగా తొలి విడతలో ఐదు మార్కెట్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

నిజామాబాద్(పసుపు), తిరుమలగిరి(ధాన్యం), వరంగల్(మక్కలు), హైదరాబాద్(మిర్చి), బాదేపల్లి(ధాన్యం) యార్డుల్లో ‘ఈ టెండరింగ్’ విధానంలో లావాదేవీలు ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఐదు మార్కెట్‌యార్డుల్లో రూ.111.38కోట్ల విలువ చేసే 17,379 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరగాల్సి ఉండగా సర్వర్ సమస్యలతో ‘నామ్’ పోర్టల్ తరచూ మొరాయిస్తోంది. రద్దీవేళల్లో నెమ్మదించడంతో నిర్దేశిత సమయంలోగా మార్కెటింగ్ ప్రక్రియను పూర్తిచేయడంలో వ్యాపారులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. మ రోవైపు వ్యవసాయ ఉత్పత్తులతో మార్కెట్‌కు తరలివచ్చిన రైతులు గంటలకొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి.

 గేట్ ఎంట్రీలోనూ సమస్యలు
మరో 39 వ్యవసాయ మార్కెట్లను నామ్ పథకం అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది జూలై 11 నుంచి మార్కెట్‌కు తరలివచ్చే ధాన్యం వివరాలను గేట్ ఎంట్రీ విధానంలో నమోదు చేస్తున్నారు. సర్వర్ సమస్యలతో గేట్ ఎంట్రీ ప్రక్రియ సకాలంలో పూర్తవడం లేదు. ఈ నేపథ్యంలో నామ్ సర్వర్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఇటీవల లేఖ రాశారు. సులభ మార్కెటింగ్ కార్యకలాపాలకు వీలుగా రూపొందిస్తున్న మొబైల్ యాప్ ను వీలైనంత త్వరగా అందజేయాలని కోరా రు. వ్యాపారులకు ఉత్పత్తులవారీగా ధరల జాబితాను ఇవ్వడం ద్వారా వేలం ప్రక్రియ మరింత సులభమవుతుందన్నారు.

మరిన్ని వార్తలు