‘పరీక్ష’ సమయం

4 Apr, 2020 01:27 IST|Sakshi

వేలల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు ఆరోగ్యశాఖ సన్నద్ధం

వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా విరివిగా పరీక్షలు తప్పవని నిర్ణయం 

2.20 లక్షల మందికి నిర్వహించేలా అత్యాధునిక కిట్లకు ఆర్డర్‌ 

రెండు గంటల్లోనే నిర్ధారణ ఫలితాలను తెలిపే పరికరాలు 

ప్రతి ఒక్కరికీ 2 రకాల పరీక్షలు: ఐసీఎంఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పరిస్థితి అదుపు తప్పిందన్న భావన నెలకొంది. మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారితోనే వైరస్‌ వ్యాపిస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగానికి కంటిమీద కునుకులేకుండా పోయింది. ఇంకా కేసులు పెరగొచ్చని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలే అంటున్నాయి. దీనిని బట్టి రాష్ట్రం మొత్తం రెడ్‌జోన్‌లో ఉన్నట్టని ఒక అధికారి వ్యాఖ్యానించారు. పరిస్థితి నియంత్రణలోకి రావాలంటే విరివిగా కరోనా వైద్య పరీక్షలు చేయడమే మార్గమన్న అభిప్రాయానికి వైద్య, ఆరోగ్యశాఖ వచ్చింది. వేలాదిమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం విదేశీ ప్రయాణ చరిత్ర, ఢిల్లీ ప్రార్థనలతో నేరుగా సంబంధం ఉన్నవారు, వారితో కాంటాక్ట్‌ అయినవారిలో లక్షణాలున్న వారికే పరీక్షలు చేస్తున్నారు.

ఇప్పుడు అలాకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైరస్‌ సోకిందన్న భావనతో జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి పరీక్షలు చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 2.20 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా కిట్లకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ఈ కిట్లు విడతల వారీగా రాష్ట్రానికి చేరుకోనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వ ర్యంలో సీసీఎంబీ సహా ఐదుచోట్ల కరోనా పరీ క్షలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరు ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ పరీక్షలు చేయించుకునేందుకు అనుమతిచ్చింది. వేలాదిమందికి ఒకే సారి చేయాల్సి వస్తే ప్రైవేటు ల్యాబ్‌లనూ ఉప యోగించుకునే అవకాశముందని ఆ అధికారి వెల్లడించారు. ఇంకా, మున్ముందు జాతీయ స్థాయి పరిశోధన సంస్థల్లోనూ పరీక్షలు చేసే అవకాశం ఉన్నట్లు ఐసీఎం ఆర్‌ తెలిపింది. అంటే  కరోనా పరీక్షలుచేసే సామర్థ్యాన్ని పెంచుతారు.

2 గంటల్లోనే నిర్ధారణ 
ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రహసనంగా మారాయి. శాంపిళ్లు సేక రించడం, వాటిని పరీక్ష లకు పంపించడం, ఫలితాలకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుండటం తో ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి.. దీంతో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అత్యాధునిక కరోనా కిట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటితో రెండు గంటల్లోనే నిర్ధారణ పరీక్ష ఫలితాలు వస్తాయని ఐసీఎంఆర్‌ చెబుతోంది. వీటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చిందని వైద్యాధికారులు చెబుతున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో వైరస్‌కు గురైన వారిని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్యాధికారి ఒకరు తెలిపారు. ‘నా దృష్టిలో నిర్ధారణైన కేసుల కంటే ఎక్కువగానే జన సమూహంలో ఉన్నాయి. అయితే వనరులు లేక తగినంత మందిని పరీక్షించడం లేద’ని ఓ అధికారి చెప్పారు. కాగా, రాష్ట్రంలో వైద్య సిబ్బందికి అవసరమైన 2 లక్షల మాస్క్‌లను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

పరీక్షలకు ముందుకురాని బాధితులు 
ఢిల్లీ వెళ్లొచ్చిన వారు, వారి బంధువులకు పెద్దఎత్తున వైరస్‌ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో ఇప్పటికే కొందరిని గుర్తించారు. కొన్నిచోట్ల ఢిల్లీ నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించి వారిని పరీక్షలకు తీసుకురావడానికి వెళ్తున్న వైద్య సిబ్బందిని చాలాచోట్ల వారి కుటుంబసభ్యులు అడ్డుకుంటున్నారు. తమకేమీ సోకలేదని, అటువంటి లక్షణాలు లేవంటూ గొడవకు దిగుతున్నారు. దీంతో హైదరాబాద్‌ సహా కొన్ని జిల్లాల్లో వైద్య సిబ్బంది, బాధితుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వీరిని తీసుకురాకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని వైద్యాధికారులు అంటున్నారు. ఢిల్లీ వెళ్లిన వారిలో అన్ని జిల్లాలకు చెందిన వారుండటం, వివిధ జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసులన్నీ ఢిల్లీ లింక్‌ ఉన్నవే కావటం గమనార్హం. 

రెండు దశల్లో పరీక్షలు 
వేలాది మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం కష్టమైన వ్యవహారం. కాబట్టి రెండు స్థాయిల్లో పరీక్షలు నిర్వహిస్తారు.  
మొదట అనుమానం ఉన్న వారి రక్త నమూనాలను సేకరించి సెరోలాజికల్‌ పరీక్ష చేస్తారు. ఆ వ్యక్తి కరోనా వైరస్‌కు ప్రభావితమయ్యాడా లేదా అనేది నిర్ధారిస్తారు. అంటే, ఆ వ్యక్తి రోగనిరోధక శక్తి వైరస్‌కు ప్రభావితమైందో, లేదో ఈ పరీక్ష తెలియజేస్తుంది. ఇది మొదటి దశ పరీక్ష. ఇందులో నెగెటివ్‌ వస్తే సదరు వ్యక్తికి రోగ లక్షణాలు లేనట్టేనని గుర్తిస్తారు. 
ఒకవేళ పై పరీక్షలో పాజిటివ్‌ వస్తే, అప్పుడు గొంతులోంచి స్వాబ్‌ నమూనాలను తీసుకొని రియల్‌ టైం పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ–పీసీఆర్‌) పరీక్ష నిర్వహిస్తారు. పాజిటివ్‌ వస్తే, ఆ వ్యక్తికి కరోనా వచ్చినట్లు నిర్ధారించి చికిత్సకు తరలిస్తారు. వాస్తవంగా గొంతులో నుంచి తీసిన స్వాబ్‌ నమూనాల ద్వారానే కరోనా నిర్ధారణ పరీక్ష చేస్తారు. 
ఇలా పై రెండు విధాలుగా పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఐసీఎంఆర్‌ నేడో రేపో మార్గదర్శకాలు జారీ చేయనుంది. మొదటి దశ పరీక్ష అరగంటలోనే ఫలితాలను వెల్లడిస్తుంది. వేగవంతమైన ఈ పరీక్ష కేవలం వ్యక్తి యొక్క రోగనిరోధక వ్యవస్థ వైరస్‌కు గురైందో లేదో చూపిస్తుంది.   

మరిన్ని వార్తలు