తెలంగాణ పోలీసులు సేఫ్‌!

14 May, 2020 03:11 IST|Sakshi

కరోనా పాజిటివ్‌ కేవలం ముగ్గురిలోనే..

వెయ్యి మందితో మహారాష్ట్ర టాప్‌

ఇండియన్‌ పోలీసు ఫౌండేషన్‌ నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసుల్లో చాలామంది కరోనా పాజిటివ్‌ బారినపడుతున్నా.. తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు సేఫ్‌గానే ఉన్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో వెయ్యి మందికిపైగా పోలీసులు కరోనా బారినపడటం అక్కడి వైరస్‌ వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. తెలంగాణలో ప్రస్తుతం ముగ్గురు పోలీసులు మాత్రమే కరోనా పాజిటివ్‌ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఇండియన్‌ పోలీసు ఫౌండేషన్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది.

తెలంగాణలోని 53,115 మంది పోలీసుల్లో కరోనా యాక్టివ్‌ కేసులు 3 మాత్రమే కాగా, వీరితో కాంటాక్ట్‌ లో ఉన్న 17 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5 కేసు లు నమోదైనా.. ఇద్దరికి చికిత్స అనంతరం నెగెటివ్‌ వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేసే వివిధ పోలీసు బలగాల (ఆర్మీతో కలిపి)లో సేకరించిన వివరాలతో పోలీస్‌ ఫౌండేషన్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 

► మహారాష్ట్ర పోలీసు విభాగంలో 1,007 మంది, సీఆర్‌పీఎఫ్‌లో 234 మంది, బీఎస్‌ఎఫ్‌లో 193 మంది, ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) 156 మంది కరోనా బారినపడ్డారు.
► ఇక, ఢిల్లీలో 522 మంది, మహారాష్ట్రలో 359 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో 248 మంది, సీఆర్‌పీఎఫ్‌లో 220 మంది, గుజరాత్‌లో 200 మంది క్వారంటైన్‌లో ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు