సడలింపులు ఇద్దామా? వద్దా?

17 Apr, 2020 01:33 IST|Sakshi

19న కేబినెట్‌ భేటీలో నిర్ణయం 

3 రోజుల్లో వచ్చే  కేసుల సంఖ్యే కీలకం  

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 19న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్‌లో భేటీ కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమల వుతున్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు యథావిధిగా కొనసాగించడమా లేక కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్‌ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ సడలింపులు ఇస్తే ఏయే రంగాలు, అంశాలు, విషయాలకు వర్తింపజేయాలని ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

కంటైన్మెంట్‌ ఏరియాల్లో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాని ప్రాంతాల పరిధిలో కొన్ని రకాల పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలకు అనుమతులిచ్చే అంశంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశముంది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో బయటపడనున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండనున్నాయి. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు అభిప్రాయానికి వస్తే కొంతవరకు సడలింపులు ఉండవచ్చని తెలిసింది. కేసుల సంఖ్య మళ్లీ పెరిగితే మాత్రం మే 3 వరకు లాక్‌డౌన్‌ను యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించే అవకాశముంది. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలను వెల్లడించే అవకాశముంది. 

>
మరిన్ని వార్తలు