గురుకుల కాలేజీలు

23 Mar, 2018 14:06 IST|Sakshi
బెల్లంపల్లి టీఎస్‌ఆర్‌ఎస్‌ ముఖద్వారం 

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు మహర్దశ

జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ 

ఉమ్మడి జిల్లాలో బెల్లంపల్లి బాలుర, నిర్మల్‌ బాలికలకు అవకాశం

వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం 

ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్ల భర్తీకి చర్యలు 

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు.. మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక 

బెల్లంపల్లి : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు మహర్ధశ పట్టబోతోంది. కొత్తగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 27 గురుకుల పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ నిర్ణయం తీçసుకుంది. ఈమేరకు జీవో నెంబర్‌ 7 జారీ చేసింది. వీటిలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లి బాలుర, నిర్మల్‌ బాలికల పాఠశాలలకు అవకాశం దక్కింది. దశాబ్దాల నుంచి హైస్కూళ్లకే పరిమితమైన ఆయా పాఠశాలలు ఎట్టకేలకు అప్‌గ్రేడ్‌కు నోచుకోవడంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. 

వచ్చే విద్యా సంవత్సరం నుంచే..
అప్‌గ్రేడ్‌ అయిన గురుకుల కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌మీడియేట్‌ విద్యాబోధన చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలుత ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశపెడతారు. ఒక్కో కోర్సులో 40 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. రెండు కోర్సులకు కలిపి 80 మంది విద్యార్థులకు ప్రవేశం దక్కుతుంది. ఈ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఇతర పాఠశాలలు, కళాశాలలతో పాటే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త భవనాల నిర్మాణాలు జరిగే వరకు ప్రస్తుతం నిర్వహిస్తున్న పాఠశాల తరగతి గదుల్లో లేదా కొత్తగా అద్దె ప్రాతిపదికన ప్రైవేట్‌ భవనాలను తీసుకుని తరగతులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 27 గురుకుల జూనియర్‌ కళాశాలలను ప్రారంభించనుండగా ఇందులో బాలుర కోసం 13, బాలికల కోసం 14 జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. గురుకుల జూనియర్‌ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 405 మందిని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రూ.117.79 కోట్ల  నిధులను విడుదల చేయనుంది.

ఐదు దశాబ్దాల క్రితం అంకురార్పణ
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు ఐదు దశాబ్దాల క్రితం ప్రభుత్వం గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. బెల్లంపల్లిలో బాలుర, నిర్మల్‌లో బాలికల గురుకుల పాఠశాలలు పని చేస్తున్నాయి. వీటిలో ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతి ఏటా ఐదో తరగతి నుంచి ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్‌ మార్కుల ప్రాతిపదికన సీటును కేటాయిస్తారు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు ప్రతిభాపాటవాలతోనే అడ్మిషన్‌ ఇస్తారు. పదో తరగతి వరకు గురుకుల పాఠశాలల్లో చదివి ఉత్తీర్ణత సాధించిన తర్వాత  ఇంటర్మీడియేట్‌ విద్యను గురుకులాల్లో అభ్యసించడానికి బాలబాలికలు పోటీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. గురుకుల జూనియర్‌ కళాశాలల్లోనూ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అయితే మెరిట్‌ మార్కులు సాధించి సీటు వచ్చిన బాలబాలికలు ఇతర జిల్లాలకు వెళ్లి చదువుకోవడానికి అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. కొద్ది మంది మాత్రమే దూరప్రాంతాలకు వెళ్లి గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ విద్యను చదువుకుంటున్నారు. వ్యయప్రయాసాలకోర్చి ఇతర ప్రాంతాలకు వెళ్లడం, అభద్రత, ఆర్థిక సమస్యలు  తదితర కారణాలతో బాలికలు డ్రాఫౌట్స్‌ అవుతున్నారు. లేదా స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ కళా«శాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంటర్‌మీడియేట్‌ను కూడా ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో చదవాలనే కోరికను అనివార్యంగా చంపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల ఆశ నెరవేరే అవకాశాలు మెరుగుపడ్డాయి.

తీరనున్న దూరభారం
గురుకుల విద్యార్థులకు చాలామట్టుకు ఇంటర్‌ విద్యను అభ్యసించడానికి దూరభారం తగ్గనుంది. ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌లో బాలికలు, బెల్లంపల్లిలో బాలుర గురుకుల జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రస్తుతం ఒక్కో గురుకుల పాఠశాలల్లో పదో తరగతిలో 80 మంది చొప్పున విద్యాభ్యాసం చేస్తున్నారు. వీటిలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు కూడా కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రాసి మెరిట్‌ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మాత్రమే గురుకుల కళాశాలల్లో సీటు దక్కుతుంది. దీంతో సీట్ల కోసం విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది.

విద్యార్థులకు ఉపయోగకరం
ప్రభుత్వం గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేయడం హర్షణీయం. నాణ్యమైన విద్యకు ఇన్నాళ్లుగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. బెల్లంపల్లి బాలుర, నిర్మల్‌ బాలికల గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసి జూనియర్‌ కళాశాలలుగా మార్చడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు ప్రస్తుత పాఠశాల తరగతి గదుల్లో ఇంటర్‌ విద్య బోధించడం జరుగుతుంది.  
ఎస్‌.సత్యనారాయణ, ప్రిన్సిపాల్, బెల్లంపల్లి గురుకుల పాఠశాల 

మరిన్ని వార్తలు